మణిరత్నం ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దానికి `నవరస` అనే టైటిల్ పెట్టాడు. మొత్తం తొమ్మిది ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ లోనూ ఒక్కో హీరో కనిపిస్తాడు. ఒక్కో ఎపిసోడ్‌నీ ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తాడు. ఇప్పటికే సూర్య, సిద్దార్థ్, మాధవన్ లాంటి హీరోల్ని ఫైనల్ చేసుకున్నాడు మణిరత్నం. తెలుగు నుంచి కూడా ఇద్దరు యువ హీరోల్ని ఎంచుకుందామనుకున్నాడు.
నాని, నాగచైతన్యలను మణిరత్నం ఈ వెబ్ సిరీస్ కోసం సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగులు చేయడం కష్టమైపోయింది. పరిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తాయో చెప్పలేకపోతున్నారు. అలా షూటింగులకు అనువైన వాతావరణం కనిపిస్తే.. వెంటనే చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేయాలి. వాటిని అలానే ఉంచి, కొత్త ప్రాజెక్టుల్ని ఎంచుకోవడానికి ఎవరికీ మనసొప్పడం లేదు. అందుకే నాని, నాగచైతన్యలు మణిరత్నం ప్రాజెక్టుని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఎప్పుడైనా మనసు మారి, ఓకే చెప్పినా చెప్పొచ్చు. కాకపోతే... మణి అంత వరకూ వెయిట్ చేయాలి కదా..? ఆయనేమో ఈ ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.