నాని నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ బ్యానర్ మీద ఇప్పటి వరకూ రెండు సినిమాల్ని నిర్మించాడు. `అ` విమర్శకుల ప్రశంసలు పొందితే... `హిట్` కమర్షియల్ గా విజయం సాధించింది. ఇప్పుడు నాని ముచ్చటగా మూడో ప్రాజెక్టుని శ్రీకారం చుట్టబోతున్నాడు. ఈ చిత్రంలో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తాడని టాక్. దశరథ్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. దశరథ్ వన్నీ కుటుంబ కథా చిత్రాలే.
ఈ సారి కూడా ఫ్యామిలీ ఎమోషన్స్‌కి పెద్ద పీట వేస్తూ ఓ కథ తయారు చేశార్ట. అది నానికి బాగా నచ్చిందని, చైతూతో అయితే ఈ కథ బాగా వర్కవుట్ అవుతుందని నాని భావిస్తున్నాడని తెలుస్తోంది. నాగ చైతన్య ప్రస్తుతం `లవ్ స్టోరీ` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన తరవాత దశరథ్ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది. నాని సినిమాలన్నీ పరిమిత బడ్జెట్ తో తెరకెక్కేవే. ఈసారీ అదే పంథాలో వెళ్తున్నట్టు టాక్.