ఏపీలో టికెట్ రేట్ల గొడవ కొనసాగుతూనే ఉంది. ఈ రేట్లకు మేం థియేటర్లని నడపలేం అంటూ... థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా థియేటర్లని మూసేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ మరికొన్ని థియేటర్లని మూసేశారు. ఏపీలో ఎంత రాద్ధాంతం జరుగుతున్నా ఒక్క హీరో కూడా నోరు మెదపలేదు. ఆఖరికి నాని నోరు తెరిచాడు. ఏపీలో టికెట్ రేట్ల వ్యవస్థ అద్వానంగా ఉందని, కిరాణా కొట్టు చేసేంత వసూళ్లు కూడా థియేటర్లు చేయడం లేదని, టికెట్ రేట్లు తగ్గించడం ప్రేక్షకుల్ని అవమానపరచడమే అని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.
నిజానికి ప్రతీ హీరో ఇన్నర్ ఫీలింగ్ ఇదే. కానీ ఎవరూ నోరు మెదపరు. ఇప్పుడు నాని మాట్లాడాడు. మరింత మంది హీరోలు ముందుకొచ్చి.. ఇదే విషయంపై బహిరంగంగా మాట్లాడాలి. కానీ అలా జరగడం లేదు. ప్రతీ హీరో.. `నాకెందుకులే` అని ఊరుకుంటున్నాడు. దానికీ కారణం ఉంది. ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే అనవసరమైన గొడవలు మొదలైపోతాయి. ప్రభుత్వ వ్యతిరేకి అనే ముద్ర పడిపోతుంది. అందుకే ఎవరి భయం వాళ్లది. ఇప్పుడు నానిపై అలాంటి ముద్రే పడింది. `నీకొందుకొచ్చిన గొడవ ఇది..` అంటూ వైకాపా నాయకులు అప్పుడే నాని పై మాటల దాడికి దిగిపోయారు. బొత్స సత్యనారాయణ నానికి గట్టిగా కౌంటర్ ఇచ్చేశారు. టికెట్ రేట్లు పెంచి, థియేటర్ యజమానులు, నిర్మాతలు అడ్డగోలుగా వసూలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని, హీరోల వ్యాఖ్యలకు వంత పాడే ఉద్దేశం లేదని బొత్స పేర్కొన్నారు. శుక్రవారం నాని సినిమా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో నాని చేసిన ఈ వ్యాఖ్యలు నాని సినిమాకి ఎంత డ్యామేజ్ చేస్తాయన్నది చూడాలి.