రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో రంగస్థలం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమా ఇది. ఇప్పుడు రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. పుష్ప 2 అయ్యాక... విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలి సుకుమార్. దాని కంటే ముందో, ఆ తరవాతో.. చరణ్ సినిమా పట్టాలెక్కడం ఖాయం. ఈ సినిమా రంగస్థలంలా ఉంటందా? వేరే కొత్త పాయింట్ తో మొదలవుతుందా? అసలు ఆ సినిమా నేపథ్యం ఏమిటి? అంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు చరణ్ ఫ్యాన్స్.
ఈలోగా... ఈ సినిమాకి సంబంధించిన ఓ సీక్రెట్ ని బయటపెట్టాడు రాజమౌళి. రామ్ చరణ్ తో సుకుమార్ తీయబోయే సినిమా గురించి తనకు తెలుసని, అందులో ఓపెనింగ్ సీన్ అదిరిపోతుందని, తను చూసిన సినిమాల్లో ది బెస్ట్ ఓపెనింగ్ సీన్ అదేనని... ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాజమౌళి. చరణ్ తో ఆర్.ఆర్.ఆర్ చేస్తున్నప్పుడు చరణే రాజమౌళికి ఈ సీన్ గురించి చెప్పి ఉంటాడు. లేదంటే సుకుమార్ - రాజమౌళి మంచి మిత్రులు. ఒకరిపై మరొకరిరి చాలా అభిమానం. అలా.. సుకుమార్.. తన సినిమాలోని సీన్ గురించి రాజమౌళి కి చెప్పి ఉంటాడు. దాన్నే ఇప్పుడు లీక్ చేశాడు రాజమౌళి.