ఓ సినిమా రిలీజ్ చేసే ముందు సవాలక్ష విషయాల్ని ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే సినిమా వ్యాపారం కూడా మైండ్ గేమ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఏ సీజన్ లో విడుదల అవుతోంది? ముందూ వెనుక పోటీ ఇచ్చే సినిమాలున్నాయా? లేదా? అనే లెక్కలు చాలా అవసరం.
ఈ విషయంలో పొరపాటు చేస్తే, సినిమా ఎంత బాగా తీసినా, ప్రమోషన్లు ఎంత గట్టిగా చేసినా లాభం ఉండదు. అయితే ఈ లెక్కలు వేయడం, అందుకు తగిన ప్రతిఫలం రాబట్టడం ఈజీ కాదు. నాని వ్యవహారం చూస్తే... ఈ లెక్కలు వేయడంలో తప్పటడుగులేస్తున్నాడేమో అనిపిస్తోంది. ఎందుకంటే...నాని కొత్త సినిమా `శ్యామ్ సింగరాయ్` ఇటీవలే విడుదల తేదీ ప్రకటించారు. డిసెంబరు 24న ఈ సినిమా రానుంది. క్రిస్మస్ సీజన్, పైగా వరుసగా సెలవలు వస్తాయి.. కాబట్టి... మంచి డేటే అనుకోవొచ్చు. కానీ సరిగ్గా వారం రోజుల ముందు అల్లు అర్జున్ `పుష్ష` రిలీజ్ కి రెడీ అయ్యింది. `పుష్ష` తక్కువ సినిమా ఏం కాదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. `ఆర్.ఆర్.ఆర్` తరవాత అంత క్రేజ్ ఉన్న సినిమా ఇది. పైగా రంగస్థలం తరవాత సుకుమార్ నుంచి వస్తోంది. కాబట్టి.. అంచనాలు అదిరిపోతున్నాయి. అది కాస్త యావరేజ్ గా ఆడినా - దాదాపు రెండు మూడు వారాల పాటు, బాక్సాఫీసుని దుల్ల కొడుతుంది. ఆ ఊపులో ఏ సినిమా కూడా కనిపించదు.
`పుష్ష` లాంటి పెద్ద సినిమాలకు కనీసం 3 వారాల గ్యాప్ ఇవ్వాలి. నాని అలా చేయడం లేదు. ఒక్క వారానికే తన సినిమాని విడుదల చేస్తున్నాడు. అలా చేస్తున్నాడంటే తన సినిమాపై నమ్మకం ఎక్కువైనా ఉండాలి. లేదంటే.. పుష్షని తక్కువ అంచనా అయినా వేసుండాలి. ఏదేమైనా నాని రిలీజ్ డేట్ ప్రకటించి పెద్ద రిస్కే తీసుకున్నాడన్నమాట టాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది.