చిన్న హీరోల్లో పెద్ద స్టార్.... నాని. ఒక్కోసారి నాని సినిమా.. బడా హీరోలకు తలదన్నే వసూళ్లు దక్కించుకుంటుంది. నాని బలం.. ఫ్యామిలీ ఆడియన్స్. కాబట్టి, తన సినిమా బాగుంటే, కుటుంబ ప్రేక్షకులంతా కట్టకట్టుకుని వచ్చేస్తుంటారు. అందుకే నాని ఇమేజ్, క్రేజ్ అలా పెరుగుతూ పోయింది. నాని సినిమా అంటే... శాటిలైట్, ఓటీటీ మంచి రేట్లు పలుకుతున్నాయి. తాజాగా శ్యామ్ సింగరాయ్‌కి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమా నాన్ థియేటరికల్ రైట్స్ కోసం 30 కోట్లు డిమాండ్ చేస్తోంది నిర్మాణ సంస్థ.
నిజానికి ఇది చాలా ఎక్కువ. బడా హీరో సినిమాకి తగ్గని రేటు ఇది. అయినా సరే, జీ.. జెమినీ లాంటి సంస్థలు నాన్ థియేటరికల్ రైట్స్ కోసం గట్టిగా పోటీ పడుతున్నాయట. 30 కాకపోయినా, కనీసం 25 కోట్లకైనా డీల్ క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. థియేటరికల్ రైట్స్ రూపంలో మరో 40 కోట్లు వచ్చినా.. నాని సినిమా 65 కోట్లు పలికినట్టు. నాని గత సినిమా `జెంటిల్ మెన్` ఫ్లాప్ అయినా, `శ్యాం సింగరాయ్`కి ఈ స్థాయి బిజినెస్ జరుగుతుండడం గొప్ప విషయమే.