దిల్‌రాజు - నాని కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలూ గతేడాది మంచి విజయం అందుకున్నాయి. నాని - కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన 'నేను లోకల్', నాని - సాయిపల్లవి జంటగా తెరకెక్కిన 'ఎంసీఏ' చిత్రాలు 2017లో దిల్‌రాజుకు నిర్మాతగా మంచి లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు.
ఆ తర్వాత నితిన్‌తో 'శ్రీనివాస కళ్యాణం' సినిమాతో బాగా నష్టపోయిన దిల్‌రాజు చేతిలో ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్ రెండున్నాయి. మహేష్‌బాబుతో 'మహర్షి', వెంకటేష్, వరుణ్‌తేజ్‌తో 'ఎఫ్ 2' ఈ రెండు చిత్రాలూ దిల్ రాజు బ్యానర్‌లో రూపొందుతున్నవే. కాగా నేచురల్ స్టార్ నానితో ముచ్చటగా మూడో హిట్ కొట్టేందుకు దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం ఓ రీమేక్ సినిమాని సిద్ధం చేస్తున్నారట. తమిళంలో విజయ్‌సేతుపతి, త్రిష జంటగా తెరకెక్కిన '96' మూవీ రీమేక్ హక్కుల్ని దిల్‌రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అక్టోబర్‌లో రిలీజ్ కానుంది. ఈ లోగా ఈ సినిమా రీమేక్ హక్కుల్ని దిల్‌రాజు సొంతం చేసుకోవడం ఆశక్తికరమైన అంశం. నాని హీరోగా ఈ సినిమాని రూపొందించే యోచనలో దిల్‌రాజు ఉన్నారనీ టాక్ వినిపిస్తోంది. త్వరలో నాని 'దేవదాస్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు 'జెర్సీ' అనే పీరియాడిక్ డ్రామాలో నాని నటిస్తున్నాడు.
తాజాగా నాని ఖాతాలో చేరిన ఈ రీమేక్ మూవీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఇటీవలే నాని 'దేవదాస్' షూటింగ్ కంప్లీట్ చేసుకుని, 'జెర్సీ' కోసం రెడీ అవుతున్నాడు. మరోవైపు నాని బుల్లితెరపై 'బిగ్‌బాస్' హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.