ఎక్కడో చైనాలో పుట్టి, ఇప్పడు ప్రపంచ దేశాలన్నింటినీ గడ గడలాడిస్తున్న కరోనా వైరస్, అన్ని రంగాల్నీ ప్రభావితం చేస్తూ, ఆఖరికి సినీ రంగాన్ని కూడా తీవ్రంగా భయపెడుతోంది. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే సినిమా ధియేటర్స్ బంద్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ దిశగా ఆలోచనలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25న రిలీజ్ కావల్సిన సినిమాల విషయంలో సందిగ్ధత నెకొంది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’, రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’తో పాటు, బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు డెబ్యూ మూవీ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?’ తదితర చిత్రాలు మార్చి 25న రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి.
అయితే, కరోనా ఎఫెక్ట్‌ని పసిగట్టిన నాని ‘వి’ టీమ్ ముందుగానే జాగ్రత్త పడింది. తమ సినిమాని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించింది. తర్వాతి రిలీజ్ డేట్ సంగతి చెప్పలేదు కానీ, ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమా పోస్ట్‌పోన్ అయ్యింది. పరిస్థితి అనుకూలిస్తే, సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రావొచ్చు. ఇక మిగిలిన సినిమాల సంగతి ఎలా ఉండబోతోందో చూడాలి మరి. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, థియేటర్లను కొంత కాలం పాటు మూసివేయాలన్న దిశగా కూడా సినీ పరిశ్రమలో చర్చ జరిగినప్పటకీ, ప్రభుత్వ నిర్ణయం కోసం టాలీవుడ్ పెద్దలు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది..