ఏదైనా వస్తువు దొంగిలించబడితేనో, నేరం జరిగితేనో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్టైంట్ చేస్తాం. ఇందులో పెద్ద విచిత్రం ఏముంది. అయితే ఇక్కడ నీడ పోయిందంటూ ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తాడు. అది విచిత్రమే కదా. నీడ పోవడమేంట్రా బాబూ. అసలు ఈ సినిమాని డైరెక్టర్ ఎలా డీల్ చేశాడ్రా అనుకుంటున్నారా! అయితే ఇక అనుకోకండి. ధియేటర్‌కి వెళ్లి 'నెపోలియన్' సినిమా చూసెయ్యండి. అస్సలు వెయిట్ చెయ్యక్కర్లేదు. రేపే ఈ సినిమా రిలీజ్.
ప్రోమోస్‌తో ఇప్పటికే సినిమాపై ఆశక్తి బాగా పెంచేశారు. నీడ పోయిందని హీరో వచ్చి చెబుతుంటేనే చాలా కొత్తగా అనిపిస్తోంది. అయితే నీడ పోయిందని ఎలా తెలిసిందంటూ పోలీస్ అధికారి అడిగితే, దేవుడు చెప్పాడంటాడు. ఇదింకా కొత్తగా ఉంది. ఏ దేవుడంటే, ఏమో తెలీదు క్యాజువల్‌గా ప్యాంటూ, షర్టు వేసుకుని కలలోకి వచ్చి చెప్పాడంటాడా యువకుడు. ఈ ప్రోమోతో భలే ఎట్రాక్ట్ చేస్తున్నారు 'నెపోలియన్' చిత్ర యూనిట్. ఆనంద్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఆయనే హీరో ఈ సినిమాకి. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సినిమా చూస్తే చాలా థ్రిల్ ఫీలవుతామంట. సినిమా అంతా ఆధ్యంతం చాలా ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించారట. సస్పెన్స్‌తో కట్టిపడేసే అంశాలు అనేకం. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా పుష్కలంగా ఉండబోతోంది.
కొత్త కాన్సెప్ట్‌లతో తెరకెక్కుతోన్న చిత్రాలకు ఆదరణ మామూలుగా లేదు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? స్టార్‌డమ్ ఉందా? లేదా? అని చూడట్లేదు ఆడియన్స్. ఆడియన్స్ కోరుకునేది కొత్తదనం. ఊహించని కథ, ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని కాన్సెప్ట్.. అదే కావాల్సింది ఆడియన్స్‌కి. రేపు దాదాపు 11 సినిమాల వరకూ విడుదలవుతున్నాయి. వాటిన్నింట్లో మన ఆనంద్ రవి 'నీడ పోయింది' కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ 'నెపోలియన్' ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.