ముగ్గురు నలుగురు హీరోలు కలసి ఓ సినిమా చేయడం అనే ట్రెండ్ బాలీవుడ్‌లోనే ఉండేది. ఆ మల్టీస్టారర్‌ల శకం తెలుగులోనూ ప్రారంభమైంది. వెంకటేష్, మహేష్‌బాబు కలసి ఎప్పుడైతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో నటించారో... అప్పటి నుంచీ మల్టీస్టారర్‌ల క్రేజ్ టాలీవుడ్‌కి పాకింది. యంగ్ హీరోలు కూడా ఇప్పుడు వాళ్ల బాటలోనే నడుస్తున్నారు. అందులో భాగంగా నలుగురు యువ హీరోలు కలసి ఓ సినిమా చేయబోతున్నారు. నారా రోహిత్, సందీప్‌కిషన్, ఆది, సుధీర్ బాబులు కలసి ఓ చిత్రంలో నటించడానికి ముందుకొచ్చారు. భలే మంచి రోజుతో ఆకట్టుకొన్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. భవ్య ఆనంద్ ప్రసాద్ నిర్మాత. ఈనెలలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం. నలుగురు యంగ్ హీరోలు కలసి నటిస్తే... ఆ క్రేజే వేరుగా ఉంటుంది. మరి ఈ నలుగురూ కలసి ఎంత హంగామా చేస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.