విలక్షణ సినిమాలను ఎంచుకుంటున్న హీరో నారా రోహిత్, 'బాణం' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలుసు కదా. అందులో నారా రోహిత్ నటనకు ఎలాగైతే మంచి మార్కులు పడ్డాయో, ఆ సినిమాతో దర్శకుడు చైతన్య దంతులూరికి కూడా అంతకన్నా ఎక్కువగా మార్కులు పడ్డాయి. మంచి కథ, కథనాలతో గ్రిప్పింగ్‌గా 'బాణం' సినిమాని చైతన్య రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఇంకోసారి రిపీట్ అవుతోంది. 'బాణం' తరహాలోనే ఈ సినిమా కూడా ఉండనుందని సమాచారమ్. 'బాణం' సినిమాకి సీక్వెల్ చేస్తున్నారని కూడా సినీ వర్గాల్లో గుసగుసలు వినవస్తున్నాయ్. అయితే ఇంకా సినిమా కథా చర్చల దశలోనే ఉందట. కొద్దిరోజుల్లోనే కథ ఫైనల్ అవుతుందని, అప్పుడు దర్శకుడు, హీరో కలిసి సంయుక్తంగా తాము చేయబోయే కొత్త సినిమాపై ప్రకటన చేస్తారని తెలియవస్తోంది. సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతంగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న విలక్షణ హీరోగా నారా రోహిత్ గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ విజయాల గురించి ఆలోచించకుండా విలక్షణమైన కథల్ని ఎంచుకోవడం అతని ప్రత్యేకత. అదే అతనితో సినిమాలు చేయడానికి కొత్త తరం దర్శకులకు మార్గం సుగమం చేస్తోంది. తనకు కూడా రొటీన్ కమర్షియల్ సినిమాలు అంతగా మెప్పించవని అంటాడు ఈ యంగ్ హీరో. ఏదేమైనా 'బాణం' లాంటి సినిమా నారా రోహిత్ నుంచి ఇంకోసారి వస్తుందంటే అది ఇంకోసారి ట్రెండ్ సెట్టింగ్ అయ్యే అవకాశం ఉంటుందనడం అతిశయోక్తి కాదు.