నందమూరి బాలకృష్ణ - నయనతారలది హిట్ కాంబినేషన్. శ్రీరామరాజ్యం, సింహా, జై సింహా సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. ఈ మూడింటిలోనూ వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇప్పుడు నాలుగోసారి ఈ జంట వెండి తెరపై సందడి చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇందులో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. కథానాయిక ఎవర్నన విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత లేదు. ఇప్పుడు ఆ అవకాశం నయనతారకు దక్కినట్టు టాక్.
ఇందులో కథానాయికగా సోనాక్షి సిన్హా, అంజలి లాంటి పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే వాళ్లకంటే... నయన అయితేనే బాగుంటుందని అనిల్ రావిపూడి భావిస్తున్నాడట. ఈ మేరకు నయనతారతో సంప్రదింపులు మొదలెట్టినట్టు తెలుస్తోంది. నయనకు కూడా బాలయ్య అంటే ప్రత్యేకమైన అభిమానం. పైగా హిట్ కాంబినేషన్. కాబట్టి..`నో` చెప్పడానికి ఆస్కారమే లేదు. త్వరలోనే.. ఈ కాంబోపై ఓ అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జై బాలయ్య, అన్నగారు లాంటి టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమా పూర్తయ్యాకే అనిల్ రావిపూడి ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది.