సౌత్‌లో నయనతారకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏరికోరి ఆమె డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు ఎదురు చూస్తుంటారు. ప్రమోషన్స్‌కి రాకున్నా, సర్దుకుపోతారు. అదీ నయన్ క్రేజ్. తమిళంలో చేతినిండా సినిమాలతో అప్‌కమింగ్ హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు, సీనియర్, జూనియర్ హీరో అనే తేడా లేకుండా అవకాశాలు దక్కించుకుంటోంది నయనతార. తెలుగులో అయితే నయన్‌కి మరీ డిమాండ్ ఎక్కువ. ఆమె నటించిన అనువాద చిత్రాలు కూడా ఇక్కడ మంచి వసూళ్లు రాబడతాయి.
మొన్న వచ్చిన 'కర్తవ్యం' సినిమా తెలుగులో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కలెక్టర్‌గా నటించింది ఆ సినిమాలో నయనతార. కాగా తాజాగా నయన్ నటించిన మరో తమిళ చిత్రం తెలుగులోకి అనువాదమవుతోంది. అదే 'ఇమైక్కనోడిగల్'. ఈ సినిమాలో నయనతార సీబీఐ ఆఫీసర్ అంజలి పాత్ర పోషిస్తోంది. ఆ పాత్ర పేరుతోనే ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే రాశీఖన్నా కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది.
హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో యంగ్ హీరో అధర్వ కీలక పాత్ర పోషిస్తున్నాడు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి మరో కీలక పాత్ర పోషించగా, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో మెప్పించాడు. ఫిబ్రవరి 22న ఈ సినిమాని తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమా తెలుగు రైట్స్‌ని దక్కించుకుంది.