'జోరు.. పప్పరపరపా..' అంటూ ముద్దు ముద్దుగా పాటేసుకున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా. సింగర్‌గా టాలెంటెడ్. హీరోయిన్‌గా 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాకే కుర్రకారుకు మ్యాజిక్ చేసింది. హిట్ కొట్టింది. ఆ తర్వాత ఒకటీ అరా సక్సెస్‌లున్నా, వరుణ్ తేజ్‌తో నటించిన 'తొలిప్రేమ' సినిమా రాశీఖన్నా కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్‌గా భావించాలి. గతేడాది నితిన్‌తో దిల్‌రాజు బ్యానర్‌లో వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం' మంచి హిట్ ఇస్తుందని భావించింది. కానీ సీను రివర్స్ అయ్యింది. ఆ సినిమా ఫలితం తేడా కొట్టేసింది.
ప్రస్తుతం తెలుగు సంగతి ఎలా ఉన్నా, రాశీఖన్నా తమిళంలో జోరు ప్రదర్శిస్తోంది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. మంచి అవకాశాల్ని దక్కించుకుంటోంది. 'ఇమైక్కా నోడిగల్' అను ఓ థ్రిల్లర్ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీఖన్నా. ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషించింది. అధర్వ హీరోగా నటించాడు. ఆ తర్వాత అక్కడ వరుస ఆఫర్లు దక్కించుకుంటోన్న రాశీఖన్నా 'టెంపర్' తమిళ రీమేక్‌లో విశాల్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
తాజాగా విజయాల్నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్న హీరో విజయ్‌సేతుపతితో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కి రాశీఖన్నా సిద్ధమైంది. విజయ్ చందర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్‌లో ప్రముఖ సక్సెస్‌ఫుల్ బ్యానర్ అయిన విజయా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో పాటు 'సైతాన్ కా బచ్చా' సినిమాతోనూ బిజీగా ఉంది. ఇలా తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ రాశీఖన్నా జోరు చూపిస్తోంది.