కరోనా కాలమిది. పెళ్లి - చావు ఏదైనా సరే లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. షూటింగులూ అంతే. చిత్రసీమ కష్టనష్టాల్ని గుర్తించిన ప్రభుత్వం - షూటింగులకు అనుమతి ఇస్తూ కీలక నిర్ఱయం తీసుకొంది. అయితే కొన్ని నియమ నిబంధనల్ని పాటించాల్సిందే అని స్పష్టం చేసింది.
సినిమా, టీవీ షూటింగ్స్ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా రూపొందించిన మార్గదర్శకాలు ఇవి. ఇక నుంచి షూటింగ్ చేయాలంటే ఇవి తప్పకుండా పాటించాల్సిందే.
1. హ్యాండ్ వాషింగ్, శానిటైజేషన్ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. ఇవి కాకుండా యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరూ మూడంచెల మెడికల్ మాస్క్, గ్లోవ్స్ షూటింగ్ స్పాట్‌లో ఉన్నంత సేపూ విధిగా ధరించాలి. ఇక ఆర్టిస్టులు, ఇతర సభ్యులు కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
2. ప్రతిరోజూ షూటింగ్ ప్రారంభించే ముందు స్టూడియో మొత్తాన్ని శానిటైజ్ చెయ్యాలి. ప్రభుత్వం గుర్తించిన సంస్థ ద్వారానే ఈ శానిటైజేషన్ జరగాలి.
3. ఆర్టిస్టులు ఇతర యూనిట్ సభ్యులు తమ ఆరోగ్య పరిస్థితి గురించి డిక్లరేషన్ ఫారం ఇవ్వాలి. సినిమాలో బుక్ చేసే ముందు, షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత వెళ్లే ముందు ఈ వివరాలను ప్రొడక్షన్ టీమ్‌కు విధిగా ఇవ్వాలి.
4. సెట్‌లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ థర్మల్ స్ర్కీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. హై టెంపరేచర్ ఉన్న వ్యక్తుల్ని సెట్‌లోకి రానివ్వకూడదు. థర్మల్ స్ర్కీనింగ్ అయిన వ్యక్తి చేతికి బ్యాండ్ వేయాలి.
5. పాపులర్ ఆర్టిస్టులతో జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణలో జాగ్రత్త వహించాలి. వారి మధ్య కనీసం రెండు మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి.
6. మూడు నెలల పాటు ఇద్దరు జూనియర్ డాక్టర్లు, ఒక క్వాలిఫైడ్ నర్స్ సెట్‌లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. వీళ్లు రెండు షిఫ్టుల్లో పని చేసేలా జాగ్రత్త వహించాలి. అలాగే సెట్ బయట అన్ని వేళలా ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండడం తప్పనిసరి.
7. కనీసం మూడు నెలల వరకూ 60 ఏళ్లు దాటిన వాళ్లు షూటింగ్ స్పాట్‌లో లేకుండా చూసుకుంటే మంచిది.
8. కొంత కాలం వరకూ ఔట్‌డోర్ గురించి మర్చిపోయి, ఇన్‌డోర్‌లో, సెట్స్‌లో షూటింగ్స్ చేస్తే మంచిది.
9. మేకప్ సిబ్బంది, హెయిర్ డ్రస్సర్స్ పీపీఈ సెట్స్ ధరించాలి. ప్రతి ఒక్కరికీ మేకప్ చేసే ముందు, చేసిన తర్వాత శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. మేకప్ చేసే సమయంలో మూడో వ్యక్తిని దగ్గరకు రానివ్వకూడదు.
10. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది సంఖ్య బాగా తగ్గించుకోవాలి. అవసరమైన మేరకే సిబ్బంది ఉండాలి.