అర్జున్ రెడ్డి తమిళ రీమేక్... అనేక మలుపులు తిరుగుతోంది. ఈ సినిమాని విక్రమ్ తనయుడు ధృవ్‌తో అక్కడ `వర్మ` పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు బాలతో నిర్మాతలకు విబేధాలు రావడంతో ఆ ప్రాజెక్టలోంచి బాల పక్కకు వెళ్లిపోయారు. అప్పటి వరకూ తీసిన సన్నివేశాల్ని పూర్తిగా పక్కన పెట్టేసి, మళ్లీ ఈ సినిమాని రీషూట్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.
అయితే ఇప్పుడు టైటిల్ కూడా మారిపోయింది. `ఆదిత్య వర్మ`గా నామకరణం చేశారు. కథానాయికగా బనిత సంథుని ఎంచుకున్నారు. మరో నాయికగా ప్రియా ఆనంద్ కనిపించనుంది. దర్శకత్వ బాధ్యతలు గౌతమ్ మీనన్‌ని అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే... దర్శకుడిగా గిరీశయ్యని ఎంచుకున్నారు. ధృవ్ గెటప్ కూడా పూర్తిగా మార్చేసి కొత్త లుక్‌ని విడుదల చేశారు.
అప్పటి `వర్మ`తో పోలిస్తే.. ఇప్పటి `ఆదిత్య వర్మ`నే కాస్త బెటర్‌గా ఉన్నాడన్నది నెటిజన్ల మాట. మరి ఈ కథలో, పాత్రల్లో ఇంకెన్ని మార్పులొస్తాయో చూడాలి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇలా ఓ సినిమా పూర్తయిన తరవాత.. ఫుటేజీ పక్కన పెట్టేసి, మళ్లీ కొత్తగా రీషూట్ చేయించడం ఇదే తొలిసారేమో.?!