నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించాలంటే ఒకప్పుడు హీరోలు అంతగా ఇష్టపడే వారు కాదు. కానీ ఇప్పుడలా కాదు. నెగిటివ్ షేడ్ చూపించేందుకు సీనియర్ జనరేషనే కాదు, యంగ్ జనరేషనే కూడా పోటీ పడుతోంది. టాలీవుడ్‌లోకి హీరోయిన్సే కాదు, విలన్స్ కొరత కూడా ఎక్కువగానే ఉంది. అందుకే నాటి సీనియర్ హీరోలకు విలన్ మేకప్ వేసి, గెటప్ ఛేంజ్ చేసేస్తున్నారు. అలాగే కొందరు యంగ్ హీరోలు కూడా హీరోలుగా అవకాశాలు రాకుంటే, విలన్స్‌గానూ కనిపించేందుకు వెనుకాడడం లేదు.
ఈ మధ్య అలా తారక రత్న, నవీన్ చంద్ర తదితర యువ హీరోలు విలన్స్‌గా కనిపించారు. ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోదగ్గది హ్యాండ్‌సమ్ హీరో జగపతిబాబు. బోయపాటి - బాలయ్య సినిమా 'లెజెండ్'తో జగపతిబాబు విలన్‌గా అవతారమెత్తాడు. ఇక అంతే, అప్పటి నుండీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓ పక్క విలన్‌గానూ, మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు.
అంతేనా, తెలుగులోనే కాకుండా,ఇ తర భాషల్లో కూడా జగ్గూ బాయ్ ఫుల్ బిజీ. లేటెస్టుగా బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు జగపతిబాబు. హీరోగా చేసినన్నాళ్లూ ఫ్యామిలీ హీరోగా ఓ వర్గం వారిని మాత్రమే అలరించగలిగిన జగపతిబాబు, విలన్‌గా మారాక, అన్ని వర్గాల వారినీ ఆకర్షిస్తున్నాడు. భారీ భారీ క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటున్నాడు.
ఇకపోతే మరో హ్యాండ్‌సమ్ గై అరవింద్‌స్వామి సంగతి చెప్పనే అక్కర్లేదు. 'తనీ ఒరువన్' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరల్డ్ వైడ్‌గా పాపులర్ విలన్ అయిపోయాడు. ఆ తర్వాత ఆయనకు హీరోగా కూడా లెక్కలేనన్ని ఆఫర్లు దక్కాయి. ఇలా చెప్పుకుంటూ పోతే, భాషతో సంబంధం లేకుండా పలువురు హీరోలు విలన్స్‌గా కొత్తదనంతో సత్తా చాటుతున్నారు.