సూర్యకి ఈమధ్య టైమ్ బాలేదు. వచ్చిన సినిమా వచ్చినట్టే వెళ్లిపోతోంది. సూర్య ఖాతాలో హిట్టు పడి చాలా రోజులైంది. ఆఖరికి ఎన్.జీ.కే కూడా సూర్యకి హిట్టు ఇవ్వలేకపోయింది. తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలతో విడుదలైన సెల్వరాఘవన్ సినిమా... రెండు చోట్లా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లూ చాలా పేలవంగా సాగుతున్నాయి. తెలుగులో తొలి మూడు రోజులకు రూ.3.5 కోట్లు వచ్చాయి. ఈ సినిమాకి రూ8 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే సగం డబ్బులు కూడా రాలేదన్నమాట. నైజాంలో అత్యధికంగా 1 కోటి రూపాయలు సంపాదించుకుంది ఎన్జీకే.
సూర్యకి బీ, సీ సెంటర్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అక్కడ కూడా ఈసినిమా నిలబడలేకపోయింది. సీడెడ్‌లో 60 లక్షలు మాత్రమే తెచ్చుకుంది. ఈస్ట్ వెస్ట్‌లలో మరీ దారుణం ఈ రెండు చోట్లా కలిపినా రూ.60 లక్షలు రాలేదు. నెల్లూరులో రూ.16 లక్షలు మాత్రమే సాధించింది. మొత్తంగా చూస్తే సూర్య ఖాతాలో మరో డిజాస్టర్ చేయిపోయినట్టే అని విశ్లేషకులు తేల్చేశారు. ఆ నష్టాలెంత అనేది మరో వారం రోజుల్లో తెలిసిపోతుంది.