'ఒక మనసు' చిత్రంతో తెరంగేట్రం చేసిన మెగా ముద్దుగుమ్మ నిహారిక, తొలి సినిమా నిరాశపరిచడంతో తర్వాతి సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంది. కానీ ఇప్పుడు మెగా డాటర్ బిజీ అయిపోయింది. ఇకపై వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కుతోన్న 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రేపో మాపో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇకపోతే నిహారిక నటిస్తున్న మరో చిత్రం తాజాగా లాంఛనంగా ప్రారంభమైంది. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ తొలిసారి నిర్మాతగా అవతారమెత్తి రూపొందిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో నిహారికతో పాటు, అందాల భామ సీనియర్ నటి శ్రియ కీలక పాత్ర పోషిస్తోంది. నిహారిక - శ్రియ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఓ డిఫరెంట్ కథాంశంతో రూపొందనుంది. క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో జ్ఞాన శేఖర్, రమేష్ కరుతూరితో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
డిఫరెంట్ కథా, కథనాలతో సాగే ఈ చిత్రానికి సరిపడా కమర్షియల్ హంగులు కూడా అద్దనున్నారట. లేడీ డైరెక్టర్ సుజనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా మెగా డాటర్ నిహారిక ఇంత గ్యాప్ తీసుకున్నా, రాబోయే కాలంలో వరుస సినిమాలతో మెగా అభిమానులను అలరించనుందట. ఇప్పటికే పలు స్టోరీ లైన్స్ చర్చల దశలో ఉన్నాయట.
హీరోగానే కాకుండా, క్యారెక్టర్ ఇంపార్టెన్స్‌ని బట్టి, ఇతర క్యారెక్టర్స్ పోషించడానికి కూడా నిహారిక రెడీగా ఉందని తెలుస్తోంది. మెగా డాటర్ ఈ సారైనా మెగా సక్సెస్ ఇచ్చి తన ఉనికిని చాటుకుంటుందేమో చూడాలిక.