అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగుతెరకి ఒక కొత్త స్టార్ హీరో పరిచయం అయ్యాడు అనే చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు కేవలం ఒక్క సినిమానే చేసిన విజయ్ నుండి అర్జున్ రెడ్డి చిత్రంలో ఆయన ప్రదర్శించిన నటనని ఎవరు ఊహించలేకపోయారు.
అయితే ఆ నటనే విజయ్ ని రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో అలా వచ్చిన స్టార్ డంని విజయ్ ఏ మాత్రం కూడా వృధా పోనివ్వకుండా తన పాపులారిటీని ప్రజల్లో ఎప్పటికే ఉండేలా ఆలోచిస్తూ ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.
అవేంటంటే- అర్జున్ రెడ్డి చిత్రంతో ముఖ్యంగా యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించడంతో, వారినే టార్గెట్ గా ఆయన సినిమాల విడుదలతో సంబంధం లేకుండా యూత్ కి చేరువయ్యే కార్యక్రమాలు చేస్తున్నాడు. అందులో మొదటగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని బాగా ఆదరించినందుకు కొంతమంది ఫ్యాన్స్ ని ఎంపిక చేసి వారికి నూతన సంవత్సరం సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ బాక్స్ లని పంపించాడు.
అలాగే అర్జున్ రెడ్డి సినిమాలో తను వాడిన మోటార్ సైకిల్ ని బొమ్మగా వేసి పంపిన హాస్టల్ స్టూడెంట్స్ కి భారీ ఎత్తున స్నాక్స్ కొని పంపించడం అలాగే ఈ మధ్యనే తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్-సికింద్రాబాద్ లలో ఉచితంగా ఐస్ క్రీంలని పంపిణిచేశాడు. వీటన్నిటితో సామాన్యం జనంలో కూడా ఆయన పాపులారిటీని పదిల పరుచుకుంటున్నాడు.
ఇక మొన్న ఫిలిం ఫేర్ కి నామినేట్ అయిన సందర్భంగా రౌడీ అనే ఒక పోర్టల్ ని ప్రారంభించి అందులో తన ఫ్యాన్స్ ని తమ వివరాలని పొందపరచమని కోరాడు. అందులో నుండి ఒక 8మంది లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి తనతో పాటుగా ఫిలిం ఫేర్ అవార్డ్స్ కి తీసుకెళ్ళాడు.
ఇక నిన్న ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడు అవార్డుని వేలం వేసి తద్వారా వచ్చిన డబ్బుని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వనున్నట్టుగా ప్రకటించాడు. ఈ పనితో ఆయన సినిమాలకి అతీతంగా ఫ్యాన్స్ సంపాదించుకోగలిగాడు.
విజయ్ చేస్తున్న ఈ పనులన్నీ గమనిస్తున్న వారు మాత్రం ఆయన తన సినీ కెరీర్ వచ్చే పాపులారిటీ ఎప్పటికి శాశ్వతం కాదని అందుకనే ఇలా వైవిధ్యమైన పనులు చేస్తూ జనసామాన్యంలో మంచి పేరు తెచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నాడు అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డి వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా తరువాత మరో హిట్ చిత్రం రావాలంటే కచ్చితంగా సమయం పడుతుంది దానితో ఆయన ఇమేజ్ తగ్గే ప్రమాదం ఉంది.
కాని విజయ్ ప్రదర్శిస్తున్న ఈ వినూత్నమైన ఐడియాలతో సినీ పరిశ్రమలో ఎంతో మందికి ఈ విషయం లో ఆదర్శంగా నిలుస్తున్నాడు.