కొన్నాళ్ళ క్రితం ప్రత్యేక హోదా గురించి గళం విప్పి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దృష్టిలో హీరో అయ్యాడు యంగ్ హీరో నిఖిల్. అయితే ఆ సమయంలో నిఖిల్ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు కూడా. 'నీకెందుకు.?' అంటూ కొందరు సోషల్ మీడియాలో నిఖిల్‌ని ప్రశ్నించేసరికి, ఆ ప్రశ్నలకు నిఖిల్ కూడా ఘాటుగానే సమాధానమిచ్చాడు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా తుపాను కారణంగా విలవిల్లాడుతోంటే, అక్కడికి వెళ్ళి మరీ తనవంతు సాయం అందించాడు నిఖిల్. దాంతో నిఖిల్, రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ మొదలయ్యాయి. నిఖిల్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాడని కూడా వాటిల్లో పేర్కొంటున్నారు. సెలబ్రిటీలకు ఇలాంటివి మామూలే. చేస్తే ఒక తంటా, చెయ్యకపోతే ఇంకో తంటా. 'నేను సాయం చేస్తున్నానహో..' అని ప్రకటించి, ఆ తర్వాత రంగంలోకి దిగలేదు నిఖిల్.
తుపాను బీభత్సంతో విలవిల్లాడుతున్న ప్రజల మధ్యకు వెళ్ళాడు, సాయం చేశాడు. సాయం అందించి, అలా సాయం చేయడం ద్వారా తాను పొందిన ఆనందాన్ని సోషల్ మీడియాలో చాటుకున్నాడు ఈ యంగ్ హీరో. ఎంతమంది చేయగలిగిన పని ఇది? కొందరికి వీలు కావొచ్చు, కొంతమందికి కుదరకపోవచ్చు. వెళ్ళగలిగాడు, వెళ్ళాడు కాబట్టి నిఖిల్‌ని అభినందించాల్సిందే. ఇందులో అతన్ని తప్పుపట్టడానికేమీ లేదు. ఇక రాజకీయాలంటారా?
నిఖిల్ కూడా ఓ పౌరుడే. కాబట్టి, రాజకీయాలపై ఆయనకు ఆసక్తి వుండదని ఎలా అనుకోగలం? అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. ప్రస్తుతానికైతే సినిమా కెరీర్‌ని కాదనుకుని, రాజకీయాల వైపు నిఖిల్ వెళ్ళేంత సీన్ వుండకపోవచ్చు.