ఓ సినిమాపై అంచనాలు అనూహ్యంగా పెరిగితే.. ఆకాశాన్నంటేసిన అంచనాలని చెబుతుంటాం. కానీ, ఆ ఆకాశం అంచులు దాటేసి.. 'అంతరిక్షం'లోకి అంచనాలు వెళ్ళిపోతేనో.? ఇది ఓ చిన్న సినిమా విషయంలో జరుగుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 'అంతరిక్షం' సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్.
ఎందుకంటే, ఇది ఓ కొత్త దర్శకుడి రెండో సినిమా. సంకల్ప్ రెడ్డి అనే ఓ దర్శకుడు, 'ఘాజీ' అనే సినిమా తెరకెక్కించేదాకా పెద్దగా ఎవరికీ తెలియదు. 'ఘాజీ' ప్రేక్షకుల ముందుకొచ్చాక అంతా ఆశ్చర్యపోయారు. పెద్ద స్టార్స్‌తో చిన్న సినిమా తీసేసి, హిట్ కొట్టేశాడు. సబ్‌మెరైన్ నేపథ్యంలో ఇండియాలోనే మొట్టమొదటి సినిమా ఇది. ప్రస్తుతం 'అంతరిక్షం' నేపథ్యంలో అద్భుతాన్ని తెరకెక్కిస్తున్నాడాయన. దాంతో, అందరి అంచనాలూ 'అంతరిక్షం'లో వుండడం సహజమే. వరుణ్ తేజ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠీ ఫిమేల్ లీడ్స్ ప్లే చేస్తున్నారు.
తమిళంలో ఇటీవలే 'టిక్ టిక్ టిక్' అనే ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా కొత్తదనంతో కూడుకున్నదన్న టాక్ అయితే బయటకు వచ్చిందిగానీ, కమర్షియల్‌గా అంత పెద్ద విజయాన్నేమీ అందుకోలేదు. ఆ సినిమా సంగతి పక్కన పెడితే, 'అంతరిక్షం' - 9000 కెఎంపిహెచ్ అనే టైటిల్ పెట్టి, సంకల్ప్ రెడ్డి ఏం చూపించబోతున్నాడన్న ఉత్కంఠ సగటు సినీ ప్రేక్షకుడిలో నెలకొంది. అంతరిక్షం నేపథ్యంలో సినిమా అంటే మాటలు కాదు. వంద కోట్లు ఖర్చు చేసినా, ఆ రిచ్‌నెస్ తీసుకురాలేరు. అలాంటిది. లిమిటెడ్ బడ్జెట్‌లో అంత పెద్ద కాన్సెప్ట్‌ని దర్శకుడు ఎలా టేకప్ చేసి వుంటాడు? ఈ ప్రశ్నకు చిన్న క్లారిటీ రేపు రాబోతోంది. ఔను, రేపే సినిమా టీజర్ విడుదల కాబోతోంది. ఆ అద్భుతమెలా వుంటుందో రేపు చూసేద్దాం.