టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా చిరంజీవి అభిమానులే ఉంటారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు... `ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరు` అని చెప్పుకుంటుంటారు. చాలామందికి చిరునే ఆదర్శం. అలాంటి చిరు తమ సినిమా వేడుకకు వస్తే.. ఎలా ఉంటుంది..? ఉత్సాహం ఉరకలెత్తుతుంది. నిఖిల్ విషయంలోనూ అదే జరిగింది. తన సినిమా `అర్జున్ సురవరం` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి 'చిరంజీవి' ముఖ్య అతిథిగా విచ్చేశాడు. చిరు 'నేను వస్తా..' అని మాట ఇచ్చినప్పటి నుంచీ నిఖిల్ భూమ్మీద లేడు. తన ఉత్సాహాన్ని, ఆనందాన్నీ సోషల్ మీడియా సాక్షిగా ప్రకటించేశాడు కూడా.
ఇప్పుడు చిరు ముందు కూడా అలానే చెలరేగిపోయాడు చిరు పాటలతో ఓ మెడ్లీ కంపోజ్ చేయించి, దానికి వేదికపై స్టెప్పులు వేశాడు నిఖిల్. మైకు పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు పూనకం వచ్చినట్టు రెచ్చిపోయాడు. నిఖిల్ మాట్లాడాడు అనడం కంటే అరిచాడు... అనడం బెటరేమో. తన గొంతు ఎక్కడ పోతుందే అన్న అనుమానం, భయం కలిగేలా మైకు పట్టుకుని విరుచుకుపడిపోయాడు నిఖిల్. ''నిన్నటి వరకూ నేను ఆయన అభిమానిని. ఈరోజు నుంచి ఆయన భక్తుడ్ని. ఈ సినిమాకు ఆయనే దేవుడు..'' అంటూ వీరావేశంతో స్పీచులు ఇచ్చాడు.
కొంతమందికి ఇది పూనకం, అత్యుత్సాహం అనిపిస్తే.. ఇంకొంతమందికి ఓవరాక్షన్‌లానూ అనిపించొచ్చు. కాకపోతే... వేదికపై నిఖిల్ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎటు చూసినా చిరంజీవి అభిమానుల హృదయాల్ని మాత్రం నిఖిల్ గెలుచుకున్నాడు. ఎన్నో వాయిదాలు పడి, పడుతూ లేస్తూ పూర్తయిన ఈ సినిమాకి చిరు అభిమానులు, చిరు ఆశీస్సులే శ్రీరామరక్ష.