యంగ్ హీరో నిఖిల్ రీమేకుల మీద పడ్డాడు. మొన్నీ మధ్యనే 'కిర్రాకు పార్టీ' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కన్నడలో ఘన విజయం సాధించిన 'కిరిక్ పార్టీ'కి ఇది తెలుగు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే నిఖిల్ 'కిర్రాక్ పార్టీ' ఆ స్థాయిలో విజయం సాధించలేదు కానీ ఓకే అనిపించాడు. అయితే ఈ సారి కూడా మరో రీమేక్‌తోనే వస్తానంటున్నాడు.
అయితే ఈ సారి తమిళ రీమేక్. 'కణితన్' అనే తమిళ రీమేక్ చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు. ఈ సినిమాకి సరికొత్తగా 'ముద్ర' అనే పేరును పరిశీలిస్తున్నారు. మరి ఈ సినిమాతో సక్సెస్ ముద్ర ఎలా వేస్తాడో నిఖిల్ చూడాలి మరి. ఇంకా ఇవి కాక నిఖిల్ చేయాల్సిన చిత్రాలు చాలానే ఉన్నాయి. తన కెరీర్‌లో మంచి హిట్ ఇచ్చిన 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్ చేయాలని నిఖిల్ కోరిక. ఎప్పటినుండో ఇది కుదరడం లేదు. కానీ త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తానని అంటున్నాడు.
'కార్తికేయ'ని మించిన స్థాయిలో 'కార్తికేయ 2' ఉండేలా కథని సిద్ధం చేయిస్తున్నాడట. అందుకే కాస్త ఆలస్యమవుతోందని చెబుతున్నాడీ యంగ్ హీరో. అయితే వరుసగా రీమేక్స్‌నే ఎందుకు పట్టుకున్నాడు నిఖిల్ అంటే, తనను నమ్ముకున్న నిర్మాతలకు లాభాలు రాకపోయినా ఫర్వాలేదు కానీ, నష్టం మాత్రం రాకూడదని అంటున్నాడు. అలా అని ఎప్పుడూ రీమేక్స్‌లోనే నటించను. కానీ ప్రస్తుతానికి కథలు అలా సెట్ అవుతున్నాయి.
కొత్తదనాన్ని ఇష్టపడుతున్న మన తెలుగు ఆడియన్స్‌కి సరికొత్త ఫీలింగ్ ఇవ్వాలనేదే తన తాపత్రయమంటున్నాడు. టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.