కోటి విద్యలు కూటి కొరకే అంటారు పెద్దలు. అలానే సినిమా వాళ్లు ఎన్ని విద్యలు ప్రదర్శించినా అది ప్రచారం కోసమే అనుకోవాలి. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ల కోసం నానా పాట్లు పడుతుంటారు. కొంతమంది వివాదాలకెక్కి ప్రమోషన్లు తెచ్చుకుంటే, ఇంకొంత మంది జనాలు మాట్లాడుకునేలా తెలివిగా ప్లాన్ చేసి ప్రమోషన్లు సంపాదించుకుంటారు. ప్రస్తుతం సందీప్ కిషన్ కూడా అదే దారి ఎంచుకున్నాడు.
సందీప్ కిషన్ నిర్మాతగా మారి చేసిన తొలి ప్రయత్నం `నిను వీడని నీడను నేనే`. శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమా హిట్టవ్వడం సందీప్ కి చాలా అవసరం. అటు హీరోగా తిరోగమన దశలో ఉన్న సందీప్ మళ్లీ కోలుకోవాలంటే ఈ సినిమా హిట్టవ్వాల్సిందే. పైగా బోలెడన్ని డబ్బులు పెట్టాడు. సందీప్ సినిమా వస్తోందంటే, జనాలు ఎగబడి థియేటర్లకేం రారు. ప్రచారంతోనే వాళ్లని ఆకట్టుకోవాలి.
సందీప్ కూడా అదే చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వినూత్నంగా ప్రచారం చేయడం మొదలెట్టాడు. తాజాగా ఈ సినిమా కోసం దొంగగా మారాడు కూడా. ప్రియదర్శి పార్క్ చేసిన బండిని... సందీప్ ఎత్తుకెళ్లాడు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. దాన్ని సినిమా ప్రమోషన్లలో వాడుతున్నారు. విషయం ఏమిటంటే.. సందీప్ ఇలా తమాషా చేస్తాడని ప్రియదర్శి కూడా ఊహించలేదట. ఇప్పుడు ఈ వీడియో బాగానే వైరల్ అవుతోంది. ప్రచారంలో ఇది కొత్తరకమైన పోకడ అన్నమాట.