బాలీవుడ్ సినిమాలు, తెలుగులోకీ, తెలుగు సినిమాలు హిందీలోకి రీమేక్ అవ్వడం ఎప్పటి నుండో జరుగుతోన్న వ్యవహారమే. అయితే తాజాగా టాలీవుడ్ సినిమాలే ఎక్కువగా బాలీవుడ్‌కి ఎగుమతి అవుతుండడం విశేషం. మొన్నీ మధ్యనే టాలీవుడ్ మూవీ 'అర్జున్ రెడ్డి' హిందీలో 'కబీర్‌సింగ్'గా రూపొంది ఘన విజయం అందుకోవడంతో పాటు, షాకింగ్ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.
ఇంకా 'కబీర్ సింగ్' మేనియా అక్కడ తగ్గలేదనే చెప్పాలి. అంతకు ముందు ఎన్టీఆర్ నటించిన 'టెంపర్'ని 'సింబా'గా తెరకెక్కించి మంచి విజయం అందుకున్నారు. తాజాగా మరిన్ని తెలుగు సినిమాలు హిందీకి ఎగుమతి అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల నాని హీరోగా తెరకెక్కిన 'జెర్సీ' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని కొన్ని కాన్సెప్టులు యూనివర్సల్‌గా వర్కవుట్ అవుతుంటాయి. వాటిలో స్పోర్ట్స్ నేపథ్యానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. అలా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'జెర్సీ'ని మన టాలీవుడ్ నిర్మాతలే బాలీవుడ్‌కి ఎక్స్‌పోర్ట్ చేయనున్నారు.
ప్రముఖ నిర్మాతలైన అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమా హిందీలో రీమేక్ చేయనున్నారు. అయితే హీరో పాత్ర పోషించేదెవరనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అక్షయ్‌కుమార్, రణ్‌వీర్ సింగ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు తాజా చిత్రం 'నిను వీడని నీడను నేనే' సినిమా రీమేక్ రైట్స్‌ని బాలీవుడ్ నిర్మాతలు సొంతం చేసుకున్నట్లు సమాచారం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హారర్ టచ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ఆశక్తిని కలిగించింది కానీ, ఆకట్టుకోలేకపోయింది. ఇక్కడ మైనస్‌లుగా భావించిన అంశాల్ని అక్కడ ప్లస్‌లుగా మార్చి రీమేక్ చేయనున్నారట. దర్శకుడు రాజ్ ఈ సినిమా హిందీ రీమేక్ బాధ్యతలు స్వీకరించారు. 'స్త్రీ', 'హ్యాపీ ఎండింగ్' తదితర చిత్రాల నిర్మాత డీకే ఈ సినిమా రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు.