ప్రస్తుతం `ఆర్.ఆర్.ఆర్` పనుల్లో బిజీగా ఉన్నాడు రాజమౌళి. ఆ తరవాత.... మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలి. రాజమౌళి, మహేష్ కలిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. ఆ క్షణాల కోసం వాళ్లంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోగా ఈ సినిమా జోనర్ గురించీ, కథాంశం గురించీ రకరకాల వార్తలొస్తున్నాయి. మహేష్ జేమ్స్ బాండ్ తరహా పాత్రలో కనిపిస్తాడని కొందరు, మహేష్ ఓ సీక్రెట్ ఏజెంట్ అని కొందరు.. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్లు మాట్లాడుకుంటున్నారు.
తాజాగా ఈ సినిమా నిర్మాత కే.ఎల్.నారాయణ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఇప్పటి వరకూ మహేష్ సినిమాకి సంబంధించిన కథ విషయంలో ఎలాంటి నిర్ణయానికీ రాలేదని, అసలు కథే రెడీ కాలేదని స్పష్టత ఇచ్చారు. నిర్మాతగా తనకే కథ చెప్పలేదని, బయట వినిపిస్తున్నవన్నీ కేవలం పుకార్లే అని స్పష్టం చేశారు. నిజానికి అక్టోబరు నాటికి మహేష్ - రాజమౌళి సినిమా మొదలు కావాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. `ఆర్.ఆర్.ఆర్` విడుదలయ్యాక... మహేష్ సినిమాపైకసరత్తు మొదలవుతుంది. అంటే.. 2021లో మహేష్ - రాజమౌళి సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేనట్టే.