అత్యంత ప్రతిష్టాత్మకమైన `ఆర్.ఆర్.ఆర్` విడుదలకు సిద్ధమైంది. ఈనెల 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రికార్డులు బద్దలు కొట్టాల్సిందే. అన్ని ఏరియాల్లోనూ అత్యధిక వసూళ్లని అందుకోవాల్సిందే. నైజాం, ఓవర్సీస్ నుంచి `ఆర్.ఆర్.ఆర్`కి భయమేం లేదు. ఏపీలో వసూళ్లు ఎలా ఉంటాయన్నదే కాస్త బెంగ. ఎందుకంటే.. అక్కడ బెనిఫిట్ షోలకు అనుమతి లేదు. టికెట్ రేట్లని విచ్చలవిడిగా పెంచేసే సదుపాయం లేదు. ఇటీవల టికెట్ రేట్లని పెంచుతూకొత్త జీవో విడుదల చేసినా - పెంచిన రేట్లు నామ మాత్రమే. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు ఈ రేట్లు ఏమాత్రం సరిపోవు. అందుకే... ఇప్పుడు రాజమౌళిలో గుబులు పుట్టుకొచ్చింది. ఎలాగైనా సరే, `ఆర్.ఆర్.ఆర్`కి అదనపు అవకాశం ఇవ్వాలని, ఈ సినిమాకి రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించాలని కోరుతూ... సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని రాజమౌళి, దానయ్యలు కలిశారు. ఆర్.ఆర్.ఆర్ ప్రతిష్టాత్మక చిత్రమని, భారీ బడ్జెట్ తో రూపొందించామని, ఈ సినిమాకి రేట్లు పెంచుకునే అవకాశం కల్పించమని ముఖ్యమంత్రిని కోరారు.
అయితే ముఖ్యమంత్రి ఈ విషయంలో సానుకూలంగా స్పందించలేదని సమాచారం. మిగిలిన సినిమాలకు ఓ రేటు, ఆర్.ఆర్.ఆర్‌కి మరో రేటు ఇవ్వలేమని, బెనిఫిట్ షోల గురించి అడగొద్దని ఆయన నిర్మొహమాటంగా చెప్పేశారని టాక్. మరోవైపు ఏపీ మంత్రి పేర్ని నాని కూడా ఇదే మాట అంటున్నారు. 5 ఆటలకు పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవమే అని, అయితే ఆ 5వ ఆట.. చిన్న సినిమాకు కేటాయించాలని, బెనిఫిట్ షోలకు ఏపీలో ఎక్కడా అనుమతి లేదని నాని స్పష్టం చేశారు. సో... ఆర్.ఆర్.ఆర్‌కు ఇది మింగుడు పడని విషయమే.