ఏ సినిమాకైనా సంగీతం సగం బలం. పాటలు బాగుంటే, సినిమా చూడాలన్న ఆసక్తి రెట్టింపు అవుతుంది. సగం పబ్లిసిటీ పాటల వల్లే అయిపోతుంది. పుష్ప విడుదలకు ముందే పాటలు సూపర్ హిట్. అన్ని భాషల్లోనూ ఈ పాటలు హిట్టే. అలా ఈ సినిమా విజయంలో సంగీతం ఇతోదికంగా సాయం చేసింది. ఈ ఫార్ములా... `రాధేశ్యామ్` విషయంలో రివర్స్ అయ్యింది. రాధేశ్యామ్ లో ఒక్క పాటా గుర్తుండదు. పాటల విషయంలో ఫ్యాన్స్ ముందు నుంచీ కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఆడియో పరంగా పాటలు స్లోగా ఉన్నా, విజువల్ గా చూస్తే, కథలో భాగంగా చూస్తే పాటలు ఎక్కుతాయేమో అని సర్దుకుపోయారు. కానీ.. అలాంటి అద్భుతాలేం జరగలేదు. సినిమా స్లో.. అనుకుంటే, పాటలు మరింత స్లో. దాంతో.. ఫ్యాన్స్‌కి నీరసం వచ్చేసింది.
సాహో సమయంలోనూ ఇంతే. ఈ సినిమాకి పాటలు పెద్ద మైనస్. ఈసారీ అదే జరిగింది. ప్రభాస్ తో యూవీ క్రియేషన్స్ తీస్తోంది పాన్ ఇండియా సినిమాలు. అలాంటప్పుడు సంగీతం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? టాలీవుడ్ లో తమన్, దేవిశ్రీ ప్రసాద్‌లు దున్నేస్తోంటే, `సాహో` కోసం బాలీవుడ్ సంగీత దర్శకుల్ని దింపారు. ఒక్కో పాటని ఒక్కొక్కరు కంపోజ్ చేశారు. ఏ ఒక్క సంగీత దర్శకుడు.. పాటలపై శ్రద్ధ పెట్టలేదన్న విషయం అర్థమైపోయింది. రిజల్టూ అలానే వచ్చింది. సాహోతో పాఠం నేర్చుకోవాల్సింది పోయి.. `రాధే శ్యామ్`లోనూ అదే తప్పు పునరావృతం చేశారు. ఈ సినిమాకీ.. ఒక్కో భాష నుంచి ఒక్కో సంగీత దర్శకుడ్ని ఎంచుకున్నారు. తీరా చూస్తే, పాటలు ఫట్టు. సినిమాలో కూడా ఏమాత్రం ఆనలేదు. `సాహో`లో జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించి సాయం చేసినట్టు, ఈసారి తమన్ వంతు వచ్చింది. `రాధేశ్యామ్`కి తమన్ ఆర్.ఆర్ ఇచ్చి చివర్లో ఓ చేయి వేశాడు.
ఒక్కో పాట ఒకొక్క సంగీత దర్శకుడితో చేయించే అలవాటు బాలీవుడ్ లో ఉంది. కానీ.. తెలుగు సినిమాల వర్కింగ్ స్టైల్ కి అది సరిపోదు. సినిమా అంతా ఒక్కడిదే అయినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది. బాధ్యతతో పాటలు చేస్తారు. పాట బాగున్నా.. సోలోగా క్రెడిట్ రానప్పుడు కంపోజింగ్ విషయంలో అంత శ్రద్ద ఎందుకు ఉంటుంది? ఒక్కో పాట.. ఒక్కో సంగీత దర్శకుడితో చేయించుకుంటున్నప్పుడు వాళ్లతో సరైన ట్యూన్స్ రాబట్టుకునే నేర్పు దర్శకుడికి ఉండాలి. సుజిత్ కి `సాహో` రెండో సినిమా. ఇప్పుడు .. రాధాకృష్ణకు కూడా రాధే శ్యామ్ రెండో సినిమానే. కాబట్టి... వీళ్ల అనుభవ లేమి పాటల విషఠయంలో స్పష్టంగా కనిపించింది. పాటలు బాగుంటే.. సినిమా ఫలితం మారిపోతుందని కాదు. కాకపోతే.. ఇంత దారుణంగా అయితే ఉండదు. ఈ విషయంలో యూవీ క్రియేషన్స్ ఇప్పటికైనా మేల్కోవాలి.