ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణలో కొత్తగా కరోనా కేసులు వుండకపోవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా, తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో, ఏప్రిల్ నెలంతా లాక్ డౌన్ కొనసాగే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ నుంచి తీపి కబురు అందిన వెంటనే, ‘సినిమా షూటింగులు కొంత మేర ప్రారంభమవుతాయేమో..’ అని సినీ కార్మికుల్లో చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణం చివరి దశలో వున్న సినిమాలకు కాస్త ఊరట దొరుకుతుందని కొందరు ఆశించారు. కానీ, పరిస్థితులు అంత సానుకూలంగా కన్పించడంలేదు. ఏప్రిల్ అంతా బంద్ చేయడమే మంచిదన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది సర్వత్రా.
‘ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదు’ అని కేంద్రం ప్రకటించినప్పటికీ, పరిస్థితులు కొంత ఆందోళనకరంగానే కన్పిస్తున్నాయి. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో సమాజంలో అన్ని విభాగాలూ తీవ్రంగా నష్టపోతున్నాయి. సినీ పరిశ్రమ కూడా తీవ్రమైన నష్టాల్ని చవిచూడబోతోందనే చర్చ సినీ వర్గాల్లో జోరుగానే సాగుతోంది. అయినాగానీ, సమాజం కోసం తమవంతుగా సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తుండడం ఆహ్వానించదగ్గ విషయమే. పరిస్థితులు వీలైనంత త్వరగా సద్దు మణగాలని తెలుగు సినీ పరిశ్రమ కోరుకుంటుంది. సినీ రంగం మాత్రమే కాదు, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మరో కీలక భూమిక పోషిస్తోన్న టెలివిజన్ రంగం కూడా ఇదే ఆలోచనతో వుంది. ఏప్రిల్ మీద ఆశలు సన్నగిల్లుతున్నాయి.. మే నాటికైనా పరిస్థితులు సానుకూలంగా మారతాయా.? వేచి చూడాలిక.