వెంకటేష్ నటించిన `నారప్ప` ఓటీటీకి పరిమితమైంది. థియేటర్ యజమానుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా సరే... సురేష్ బాబు కనికరించలేదు. ఈ సినిమాని ఓటీటీ పరం చేశారు. అయితే ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వడం ఎవ్వరికీ ఇష్టం లేదట. ఆఖరికి సురేష్ బాబు కి కూడా. తమిళ నిర్మాత థాను కి `నారప్ప`లో భాగస్వామ్యం ఉంది. ఆయన బలవంతంపైనే ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చారని, లేదంటే థియేటర్లలోనే విడుదల అవ్వాల్సివుందని తెలుస్తోంది. సురేష్ బాబు కూడా ఇదే అంటున్నారు.
``ఓటీటీలో విడుదల చేయాల్సిన సినిమా కాదిది. కానీ థాను మాత్రం ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయం తీసుకునే అధికారం నాకుంటే.. ఇది థియేటర్ కే ఇచ్చేవాడ్ని`` అన్నారు సురేష్ బాబు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా ఇదే అంటున్నారు. ``ఇది ఓటీటీ సినిమా కాదు. థియేటర్ కోసమే తీశాం. ఆ క్వాలిటీ, సౌండ్.. అవన్నీ థియేటరికల్ రిలీజ్ ని దృష్టిలో ఉంచుకునే తీశాం. సడన్ గా ఓ రోజు.. సురేష్ బాబు వచ్చి `మన సినిమాని ఓటీటీకి ఇస్తున్నాం` అన్నారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. అందులోంచి తేరుకోవడానికి రెండు రోజులు పట్టింది. ఓటీటీలో విడుదల చేయడం ఎవరికీ ఇష్టం లేదు. కానీ... ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తప్పడం లేదు`` అన్నారు.
అమేజాన్ ఈ సినిమా హక్కుల్ని ఏకంగా 35 కోట్లకు కొన్నట్టు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ 22 కోట్ల లోపే అని.. ఆలెక్కన నిర్మాతలకు 12 కోట్ల లాభమని తెలుస్తోంది. ఇంత లాభసాటి బేరం ఉన్నప్పుడు ఈ సినిమాని ఓటీటీకి ఎందుకు ఇవ్వకూడదు??