తరుణ్ భాస్కర్ కెరీర్ ఏంటో కాస్త కన్‌ఫ్యూజన్ గా ఉంది. పెళ్లి చూపులు సినిమాతో ఇండ్రస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. అతి తక్కువ బడ్జెట్లో తీసిన ఆ సినిమా.. భారీ వసూళ్లు సాధించింది. ఆ వెంటనే పది సినిమాలకు సరిపడా అడ్వాన్సులు తీసుకున్నాడు. అయితే.. ఆ తరవాత తెరకెక్కించింది ఒకే ఒక్క సినిమా. ఈ నగరానికి ఏమైంది? తరవాత.. తరుణ్ భాస్కర్ మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. వెంకటేష్ తో తరుణ్ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఈమధ్య ఈ సినిమాపై వెంకీ క్లారిటీ ఇచ్చేశాడు.
`తరుణ్ చెప్పిన కథ నచ్చలేదు. వేరే కథ వర్కవుట్ చేయమ్ననా` అనేశాడు. దాంతో వెంకీ - తరుణ్ ల సినిమా దాదాపుగా లేదన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నాగచైతన్య కోసం ఓ కథ రెడీ చేశాడట తరుణ్ భాస్కర్. ఇటీవల చైతూకి ఈ కథ వినిపించడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని టాక్. ఇది సురేష్ ప్రొడక్షన్స్ లోనే తెరకెక్కిస్తారని తెలుస్తోంది. మామతో చేయాలనుకున్నాడు. అల్లుడితో సెటిల్ అయ్యాడు. మొత్తానికి ఈ ప్రాజెక్టయినా పట్టాలెక్కుతుందా? లేదంటే మళ్లీ ఎగుడుదిగుడులు మొదలవుతాయా? చూడాలి. ప్రస్తుతం `థ్యాంక్యూ` సినిమాతో బిజీగా ఉన్నాడు చైతూ. ఆ తరవాత.. `బంగార్రాజు` ఉంటుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా ఓ కథతో రెడీగా ఉన్నాడు. వాటిమధ్య తరుణ్ భాస్కర్ సినిమా ఎప్పుడు ఉంటుందో?