ఈ రోజుల్లో ఏ సినిమాకైనా ప్రచారమే కీలకమైపోయింది. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే ప్రమోషన్లతో ఉదరగొట్టడం తప్పని సరి. సినిమాలో స్టార్లుంటే.. వాళ్లతో కావల్సినంత పబ్లిసిటీ చేయించుకోవాల్సిందే. ప్రతీ సినిమా అదే సూత్రం ఫాలో అవుతోంది. అయితే 'ఓరి దేవుడా' మాత్రం ఈ విషయంలో కాస్త వెనుకబడిందనే చెప్పాలి. శుక్రవారం విడుదల అవుతున్న నాలుగు సినిమాల్లో ఓరి దేవుడా ఒకటి. విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రమోషన్లలో వెంకీ ఎక్కడా కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి కూడా హాజరు కాలేదు. రాజమండ్రిలో ఓ ఈవెంట్ జరిగింది. అక్కడకు రామ్ చరణ్ వచ్చాడే తప్ప... వెంకీ కనిపించలేదు.
వెంకటేష్ లాంటి నటుడు సినిమాలో ఉన్నాడంటే... తనని ఫ్రంట్ లైన్‌లోకి తీసుకొచ్చి పబ్లిసిటీ చేయించుకోవాలి. సినిమాకి చాలా ప్లస్ అయ్యే పాయింట్ ఇది. కానీ. దాన్ని చిత్రబృందం మర్చిపోయింది.ఈ సినిమా ప్రమోషన్లకు రానని వెంకీ ముందే చెప్పేశాడో, వెంకీ లేకపోయినా ఫర్వాలేదు అని టీమ్ అనుకొందో తెలీదు గానీ...'ఓరి దేవుడా' వెంకీని వాడుకోకుండా పెద్ద తప్పు మాత్రం చేసింది. అయితే విశ్వక్ సేన్ వాదన ఇంకోలా ఉంది. ''ఫలక్ నామా దాస్ టైమ్ లో వెంకీ నా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. నా సినిమాకి అది చాలా హెల్ప్ అయ్యింది. పక్కోడి సినిమాలకే ప్రమోషన్లు చేసి పెడతారు ఆయన.
తన సినిమా ప్రమోషన్లకు ఎందుకు రారు? సల్మాన్ ఖాన్ సినిమా కోసం వెంకీ సార్ ముంబై వెళ్లారు. అందుకే మా ప్రమోషన్లలో కనిపించలేదు. సక్సెస్ మీట్ లో మాత్రం తప్పకుండా తీసుకొస్తామ''న్నాడు విశ్వక్.