స్ట్రయిట్ తెలుగు సినిమాలకు ఉన్నంత వాల్యూ డబ్బింగ్ బొమ్మలకు ఉండవు. అందుకే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీసినా.. దాన్ని స్ట్రయిట్ సినిమాగానే చెప్పుకొంటారు. ప్రిన్స్ సినిమాని అలానే మొదలెట్టారు. శివకార్తికేయన్ ని తెలుగులోకి తీసుకొస్తున్నామని నిర్మాతలు గొప్పగా ప్రకటించారు. ఈ సినిమాని జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకుడు కావడంతో... ఇది శివ కార్తికేయన్ స్ట్రయిట్ తెలుగు సినిమాగానే తెలుగు ప్రేక్షకులు నమ్మారు. ఎప్పుడైతే... టీజర్, ట్రైలర్ బయటకు వచ్చాయో.. అప్పుడే ఇది డబ్బింగ్ సినిమా అని అర్థమైపోయింది. పూర్తిగా తమిళంలో తీసి, తెలుగులో డబ్ చేసిన సినిమా ఇది. శివ కార్తికేయన్ తో తెలుగు సినిమా తీస్తామని చెప్పిన నిర్మాతలు డబ్బింగ్ సినిమా వదలడమేమిటో జనాలకు అర్థం కావడం లేదు.
దీనిపై హీరో శివకార్తికేయన్ క్లారిటీ ఇచ్చారు. ఇది ముందు తమిళంలో తీసి, ఆ తరవాత తెలుగులో ఎందుకు డబ్ చేయాల్సివచ్చిందో వివరించారు. ``ప్రిన్స్ అనేది కామెడీ సినిమా. కామెడీ పండాలంటే.. భాష బాగా తెలిసి ఉండాలి. నాకు తెలుగు అస్సలు రాదు. తెలుగుని సరిగా అర్థం చేసుకోకుండా డైలాగులు చెబితే... హాస్యం అపహాస్యం పాలవుతుంది. అందుకే నేరను కంఫర్ట్ జోన్‌లోకి వెళ్లి.. తమిళంలో డైలాగులు చెప్పా. ఆ తరవాత తెలుగులో డబ్ చేశాం. తెలుగులో పట్టు సాధించిన తరవాతే... స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తా`` అని క్లారిటీ ఇచ్చాడు శివకార్తికేయన్. ఏది ఏమైతేనేం.. ఈ సినిమాపై డబ్బింగ్ ముద్ర పడిపోయింది.