వరుస పరాజయాలతో నీరసడిపోయిన శ్రీనువైట్లకు మైత్రీ మూవీస్ అవకాశం ఇవ్వడమే చాలా గొప్ప విషయంగా కనిపించింది. దాన్ని శ్రీనువైట్ల ఎలాగూ సద్వినియోగ పరచుకోలేకపోయాడనుకోండి.. అది వేరే విషయం. అయితే శ్రీనువైట్లకు మైత్రీ అవకాశం ఇవ్వడం వెనుక జరిగిన అసలు రహస్యం ఇప్పుడే బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాకి శ్రీనువైట్ల డబ్బులు తీసుకోకుండానే పనిచేశాడట. 'నాకు పారితోషికం ఏమీ వద్దు.. లాభాలొస్తే అందులో వాటా ఇవ్వండి చాలు' అన్నాడట. ఆ ఒప్పందంపై ఈ సినిమా పట్టాలెక్కింది.
బడ్జెట్‌కు రూపాయి ఎక్కువైనా మేం ఇవ్వం.. అని మైత్రీ ముందే చెప్పిందట. అందుకే అనుకున్న బడ్జెట్‌లోనే ఈ సినిమాని పూర్తి చేశాడు శ్రీనువైట్ల. ఈ సినిమా రూ.25 కో్ట్లతో పూర్తయిందని టాలీవుడ్ టాక్. శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో దాదాపుగా 20 కోట్లు వెనక్కి వచ్చేశాయి. మిగిలిన రూ.5 కోట్లు అడ్వాన్సుల రూపంలో వచ్చాయి. దాంతో మైత్రీ మూవీస్ సంస్థ గట్టెక్కేసింది.
ఇక శ్రీను చేతికి డబ్బులు రావాలంటే... ఈ సినిమా హిట్టయి, థియేటర్ల నుంచి వసూళ్లు వెనక్కి రావాలి. శ్రీను దురదృష్టం కొద్దీ ఈసినిమా ఫ్లాప్ అయ్యింది. రెండో ఆటకే.... సగం థియేటర్లు ఖాళీ అయ్యాయి. దాంతో లాభాల్లో వాటా అనే ఆశ కూడా ఆవిరైపోయింది. మొత్తానికి మరోసారి 'జీరో' పారితోషికానికి శ్రీనువైట్ల పనిచేయాల్సివచ్చిందన్నమాట.