జయం, బృందావన కాలనీ చిత్రాలతో ఆకట్టుకున్న హాస్య నటుడు సుమన్ శెట్టి. తెరపై కమెడియన్లు ఎంత మంది ఉన్నా సరే, తనదైన హాస్యంతో నవ్వులు పంచేవాడు. ఇప్పుడు తన జోరు తగ్గింది. అయితే సుమన్ శెట్టి సినిమాలు మానేసి, విశాఖపట్నం వెళ్లిపోయాడని, అక్కడో షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడని ఇటీవల వార్తలొచ్చాయి. వీటిపై తీవ్ర స్థాయిలో మండిపడిపోతున్నాడు ఈ హాస్యనటుడు. తానెక్కడికీ వెళ్లలేదని, కళామతల్లిని అంటిపెట్టుకునే ఉన్నానని, బతుకైనా, చావైనా సినిమాల్లోనేనని చెబుతున్నాడు.
తనకు తెలుగులో అవకాశాలు తగ్గిన మాట వాస్తవమని, అయితే.. మిగిలిన భాషల్లో ఛాన్సులు వస్తున్నాయని, తెలుగులోనూ అడపాదడపా సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇలాంటి వార్తలు రాసేబదులు అడుక్కుతింటే బాగుంటుందని, తన దగ్గరకు వస్తే.. ఐదో పదో పడేస్తానని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు.
''సినిమా అంటే నా ప్రాణం. నటించడం తప్ప మరేం తెలీదు. అలాంటిది నేనెందుకు సినిమాల్ని వదిలేస్తాను. ఇలాంటి వార్తలు రాసేవాళ్లకు బుద్ధిలేదు. 'నేను వైజాగ్ వెళ్లిపోతున్నా' అని వాళ్లకు చెప్పి వెళ్లానా? సెలబ్రెటీల మీద వార్తలు రాసి, ఆ డబ్బుతో కడుపు నింపుకోవడానికి సిగ్గుండాలి'' అని ఫైర్ అయిపోతున్నాడు ఈ హాస్యనటుడు.