ఏప్రిల్ నెలలో సినిమాలు విడుదలయ్యే పరిస్థితి కన్పించడంలేదు. మే నెలలోనూ పరిస్థితి ఇలాగే వుండొచ్చు. జూన్ నాటికి పరిస్థితులు ఓ కొలిక్కి రావొచ్చునన్న చర్చ జరుగుతుండగా, ఆ ఆలోచన అస్సలేమాత్రం సబబు కాదని మరికొందరు అంటున్నారు. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో, పరిస్థితులు ఇప్పుడప్పుడే అంత అనుకూలంగా మారతాయని అనుకోవడానికి వీల్లేదట. ఓ అంచనా ప్రకారం సెప్టెంబర్ నాటికి కొంత ఉపశమనం దొరుకుతుందట. అయితే, సెప్టెంబర్ కూడా కాదు, ఈ ఏడాదిని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనని ఇంకొందరు అంచనా వేస్తున్నారు. దానికి చాలా కారణాలున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేసినా, జనం కొంత కాలం పాటు ‘గుమికూడకుండా’ వుండటమే మంచిదని గత అనుభవాలు చెబుతుండడంతో, సినిమా దియేటర్లకు ఇప్పట్లో అనుమతులు రాకపోవచ్చునన్నది ఓ వాదన.
సినిమాల రిలీజ్‌కి అనుకూల పరిస్థితుల్లేకపోతే, సినిమా షూటింగులు జరిగి మాత్రం ఏం లాభం.? అని కొందరు పెదవి విరవడం మామూలే. అందులో నిజం కూడా లేకపోలేదు. ఇదంతా పెద్ద ట్రాష్.. ఒక్కసారి పరిస్థితి అదుపులోకి వస్తే, ఆ తర్వాత ఇబ్బంది ఏమీ వుండదని కొందరు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ‘ఇది ఇక్కడ పుట్టిన వైరస్ కాదు.. గాల్లో ఎక్కువ రోజులు వుండదు. లాక్‌డౌన్‌తో మంచే జరిగింది. మొత్తంగా దేశం నుంచి కరోనా వైరస్‌ని తరిమికొట్టడానికి ఇదే సరైన విధానం. వీలైనంత త్వరగా సినీ పరిశ్రమకు తీపి కబురు అందుతుందని ఆశిస్తున్నాం..’ అని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సో, 2020ని టాలీవుడ్ మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఈ సంక్రాంతికి రెండు పెద్ద హిట్లు పడ్డాయి. సమ్మర్‌ని మిస్ అవబోతున్నామంతే. ఆ తర్వాత మళ్ళీ సినిమాల జాతర చూడబోతున్నాం.