పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా రెండు సినిమాల్లో నటిస్తున్నాడిప్పుడు. అందులో ఒకటి ‘వకీల్ సాబ్’ అయితే, ఇంకోటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా. రాజకీయాల నుంచి కాస్త వెసులుబాటు కుదుర్చుకుని, వేగంగా సినిమాలు చేసేయాలనుకున్న పవన్ కళ్యాణ్‌కి కరోనా లాక్ డౌన్ పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టింది. ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ కొద్ది రోజుల్లో పూర్తవుతుందనగా, లాక్‌డౌన్ తెర మీదకు వచ్చింది. దాంతో, మే నెలలో విడుదలవ్వాల్సిన ‘వకీల్ సాబ్’ కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట. మరోపక్క, క్రిష్ సినిమా ఈ ఏడాదిలో విడుదలవడం అసాధ్యంగానే కన్పిస్తోంది. వచ్చే ఏడాది తొలి క్వార్టర్‌లో అయినా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో క్రిష్ సినిమాని కాస్త వెనక్కి పెట్టి, హరీష్ శంకర్‌తో సినిమాని ముందుకు తీసుకురావాలని పవన్ ఆలోచిస్తున్నాడట. మూడు సినిమాలకు సంబంధించి పిక్చర్ క్లియర్‌గా వుంటే, మరో మూడు నుంచి నాలుగు సినిమాలదాకా చర్చల దశలో వున్నాయి పవన్ కళ్యాణ్ చేయాల్సినవి. వీటిల్లో ఏ ఒక్కటీ ‘పూర్తిగా ఆగిపోయే’ పరిస్థితి వుండదనీ, పవన్ కళ్యాణ్ అన్ని లెక్కలూ పక్కాగా వేసుకున్నాకే సినిమాల్లో మళ్ళీ నటించాలనే నిర్ణయం తీసుకున్నాడనీ అంటున్నారు.