అదేంటో గానీ, ఐకాన్‌కి ముందు నుంచీ గండాలే. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` తరవాత ఐకాన్ చేయాల్సింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అల్లు అర్జున్ కాస్త వెనుకంజ వేశాడు. `వకీల్ సాబ్` తరవాత... మళ్లీ వేణు శ్రీరామ్ ని పిలిపించి - కథ ఓకే చేయించుకున్నాడు. పుష్ష 1 తరవాత... ఐకాన్ పట్టాలెక్కుతుందని అంతా భావించారు. వేణు శ్రీరామ్ కూడా అదే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ ఐకాన్‌కి బ్రేక్ పడబోతోందని టాక్.
పుష్ష 1కీ, పుష్ష 2కీ మధ్య వచ్చే గ్యాప్ లో ఐకాన్ పూర్తి చేయాలన్నది బన్నీ ఆలోచన. అయితే ఇది మారింది. బోయపాటి శ్రీనుకి ఈసారి మరో అవకాశం ఇద్దామని బన్నీ భావిస్తున్నాడు. పుష్ష 1 అవ్వగానే... బోయపాటి సినిమా మొదలవుతుంది. ఆ తరవాత పుష్ష 2 ఉంటుంది. దాని తరవాతే.. ఐకాన్ అని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ స్క్రిప్టుని ఇప్పటికే లాక్ చేసేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనులూ మొదలెట్టేశాడు. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వేణుని ఇబ్బంది పెట్టేదే. బోయపాటి శ్రీను సినిమాల్ని మరీ వేగంగా ఏం తీయడు. కనీసం 9 నెలల సమయం తీసుకుంటాడు. ఆ తరవాత. పుష్ష 2 ఉంటుంది.. అంటే... ఐకాన్ కోసం మరో యేడాదిన్నర అయినా ఆగాల్సిందే. మరి వేణు శ్రీరామ్ అప్పటి వరకూ ఎదురు చూడగలడా?