'నోటా'కి భయంకరమైన రివ్యూలొచ్చాయి. విజయ్ దేవరకొండని విపరీతంగా అభిమానించేవాళ్లు సైతం 'ఇదేం సినిమా రా బాబూ' అంటూ తలలు పట్టుకున్నారు. అయితే... విజయ్ కి ఉన్న క్రేజ్ వల్ల వీకెండ్‌లో 'నోటా'కి మంచి వసూళ్లే వచ్చాయి. ఓ ఫ్లాప్ సినిమాకి ఈ రేంజులో వసూళ్లు రావడం కూడా గ్రేటే.
తెలుగు రాష్ట్రాల్లో కాస్త నిలదొక్కుకున్న 'నోటా' ఓవర్సీస్‌లో మాత్రం మునిగిపోయింది. అక్కడ నెగిటీవ్ రివ్యూలు వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. తొలిరోజు 187 వేల యూఎస్ డాలర్లు సంపాదించిన 'నోటా' మిగిలిన మూడు రోజులకు గానూ 150 వేల యూస్ డాలర్లకు కూడా సాధించలేకపోయింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాని మంచి రేటుకు కొనుక్కున్న బయ్యర్లకు భారీ నష్టాలు మిగిలేట్టే కనిపిస్తున్నాయి.
మరోవైపు 'దేవదాస్' పరిస్థితి కూడా అంతే. తెలుగు నాట 'యావరేజ్' అనిపించుకున్న ఈ సినిమా... ఓవర్సీస్‌లోనూ నిలదొక్కుకోలేకపోయింది. ఇప్పటికి కేవలం 75వేల యూస్ డాలర్లను మాత్రమే అందుకుంది. నాని గత చిత్రాల వసూళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి.