విజయ్ దేవరకొండ 'నోటా' ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో ఒక్కసారిగా స్టార్ అయిపోయిన విజయ్... ఈ సినిమాతో మరోసారి అద్భుతమైన ఓపెనింగ్స్ అందుకున్నాడు.
విడుదలైన ప్రతీచోటా... వసూళ్లు చాలా బాగున్నాయి. తమిళనాట కూడా ఈ చిత్రానికి ఊహించని విధంగా ఓపెనింగ్స్ వస్తున్నాయి. అయితే... రివ్యూలు మాత్రం 'నోటా'కి వ్యతిరేకంగా వస్తున్నాయి. అంతేకాదు.. 'ఇదో డబ్బింగ్ బొమ్మ'గా సమీక్షకులు తేల్చిపారేశారు. నోటాని తెలుగు, తమిళ భాషల్లో తీసిన చిత్రంగా సినీ రూపకర్తలు చెబుతూ వచ్చారు. మనవాళ్లు కూడా అదే నిజమని నమ్మారు.
దానికి కారణం.. విజయ్ - తెలుగులో ఓ స్టార్. తమిళంలో ఇప్పటి వరకూ విజయ్ నటించనేలేదు. కాబట్టి ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో తీశారనుకున్నారు. కానీ ఇది అచ్చంగా తమిళ బొమ్మ. తమిళంలో తీసి తెలుగులో డబ్ చేశారంతే. దానికి తోడు... ఈ సినిమా మొత్తం తమిళ రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది. విజయ్ తప్ప ఒక్క తెలుగు స్టార్ కూడా ఇందులో లేడు. ప్రియదర్శి పాత్రని రెండు చోట్లా వేర్వేరు నటులతో చేయించారంతే.
అంతకు మించిన మార్పులేం కనిపించలేదు.