రాజమౌళి గండానికి ఎవ్వరూ అతీతులు కాలేకపోయారు. రాజమౌళితో ఓ సినిమా చేస్తే.. అది సూపర్ డూపర్ హిట్టవ్వడం ఎంత సహజమో.. ఆ తరవాతి సినిమా బొక్క బోర్లా పడడం అంతే సహజం. తాజాగా.. ఆచార్యతో అదే జరిగింది. ఆర్.ఆర్.ఆర్ ఇచ్చిన ఘన విజయంతో ఖుషీగా ఉన్న చరణ్... ఆచార్య ఫ్లాప్ తో.. ఒక్కసారిగా డల్ ఫేజ్‌లోకి వెళ్లిపోయాడు. దాంతో రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ కు తిరుగులేదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఇప్పుడు అందరి కళ్లూ.. ఎన్టీఆర్‌పైనే.
రాజమౌళితో తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి హిట్టు. ఆ తరవాత కొన్ని ఫ్లాపులు చూశాడు ఎన్టీఆర్. సింహాద్రి తరవాత అలాంటి హిట్ చూడడానికి ఎన్టీఆర్‌కి చాలా కాలం పట్టింది. యమదొంగ టైమ్ లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తరవాత.. కొరటాలతో ఓ సినిమా చేస్తున్నాడు. కొరటాల అయినా ఎన్టీఆర్ ని ఈ గండం నుంచి గట్టెక్కిస్తాడా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. ఆచార్యతో చరణ్‌కి హిట్ ఇవ్వలేక, రాజమౌళి సెంటిమెంట్ కి తలొగ్గాడు.. కొరటాల. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ అదే జరుగుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సెంటిమెంట్ ఈసారి వర్కవుట్ అవుతుందా, లేదా? అనేది తెలియాలంటే దాదాపు యేడాది ఆగాలి. ఎందుకంటే.. ఎన్టీఆర్ - కొరటాల సినిమా ఇంకా మొదలవ్వనే లేదు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకొంత సమయం ఉంది.