పాత్ర కోసం ఎంత కష్టమైనా చేయడానికి నవతరం కథానాయకులు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ ముందుంటాడు. ఇది వరకు బొద్దుగా ఉండే ఎన్టీఆర్.. యమదొంగ కోసం రివటలా తయారయ్యాడు. సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం తన దేహాకృతిని కూడా మార్చుకుంటున్నాడు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్‌ల కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో నయా ఎన్టీఆర్‌ని చూడబోతున్నారు అభిమానులు. అందుకోసం ఎన్టీఆర్ కూడా తగిన రీతిలో సిద్ధమవుతున్నాడు. ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నాడు. బాలీవుడ్లో లాయిన్ చాలా ఫేమస్. అక్కడి నుంచి ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ వచ్చాడు లాయిడ్.
లాయిడ్ ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా డైట్ సిద్ధం చేశాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆల్కహాల్‌కి దూరంగా ఉంటున్నాడు. అతని భోజనం కూడా పూర్తిగా మారిపోయింది. నెల రోజుల పాటు ఎన్టీఆర్ డైటింగ్ లో ఉండబోతున్నాడని, ఓ క్రమ పద్ధతిలోనే ఆహారం తీసుకుంటున్నాడని, రోజుకి మూడు గంటలు జిమ్‌లోనే గడుపుతున్నాడని సమాచారం. మొత్తానికి పాత్ర కోసం బాగానే ఒళ్లొంచుతున్నాడు ఎన్టీఆర్. మరి.. తెరపై ఎలా కనిపిస్తాడో చూడాలి.