వెండితెర కథానాయకుడు.. దేశంలోనే మహా నాయకుడు ఎలా అయ్యాడు? ఇదీ స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర. అవును, ఎన్‌టిఆర్ బయోపిక్ కోసం రెండు పేర్లు ఖరారయ్యారు. పేర్లు రెండు, పార్టులు రెండు.. సినిమా మాత్రం ఒకటే. ఒక పార్ట్, జనవరి 9న విడుదల కాబోతోంది. రెండో పార్ట్ జనవరి 26న విడుదల కాబోతోంది.
ఒక పార్ట్ పేరు 'ఎన్‌టిఆర్ కథానాయకుడు' కాగా, మరో పార్ట్ పేరు 'ఎన్‌టిఆర్ మహానాయకుడు'. స్వర్గీయ ఎన్టీఆర్ సినిమా జీవితం 'కథానాయకుడు'లో కన్పించనుంది. 'మహానాయకుడు'లో ఆయన రాజకీయ జీవితం కన్పించబోతోంది. అయితే 'వెన్నుపోటు' ఎపిసోడ్ తప్ప, స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ ఈ రెండు పార్టుల్లోనూ చూడొచ్చు. తెలుగు సినిమాకి సంబంధించి 'ఎన్‌టిఆర్ బయోపిక్' ఓ సరికొత్త చరిత్రగా చెప్పుకోవాల్సి వుంటుంది.
ఎందుకంటే, 'రక్తచరిత్ర', 'బాహుబలి' సినిమాలు పార్టులు పార్టులుగా ప్రేక్షకుల ముందుకొచ్చినా, ఒక పార్ట్‌కీ ఇంకో పార్ట్‌కీ మధ్య చాలా గ్యాప్ వుంది. కానీ, 'ఎన్‌టిఆర్ బయోపిక్' రెండు పార్టులూ ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాయి. సో, 2019 జనవరి నందమూరి అభిమానులకు అతి పెద్ద పండగ కాబోతోందన్నమాట. అసలే సంక్రాంతి వసూళ్ళ రారాజుగా బాలయ్యకి మంచి పేరుందాయె. ఇకనేం, సంక్రాంతికీ దున్నేసి.. ఆ తర్వాత కూడా ఆ దున్నుడు కొనసాగించి.. నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి తానే 'కింగ్' అన్పించుకుంటాడేమో.
క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ఇది.