అటు తిరిగి, ఇటు తిరిగి తెలుగుదేశం పార్టీ రాజకీయం, కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిపోయిందంటూ రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర 'ఎన్‌టిఆర్ బయోపిక్' గందరగోళంలో పడింది.
ఈ సినిమా కోసం రానా (చంద్రబాబు పాత్రధారి) భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారనీ, ఆ ఎపిసోడ్ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా వుంటుందనీ ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే. అది నిజమో కాదోగానీ, సినిమాలో కాంగ్రెస్ యాంటీ డైలాగులైతే వుంటాయ్. కానీ, ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ టర్న్ తీసుకున్నారు. కాబట్టి, హీరో బాలయ్య కూడా చంద్రబాబు చెప్పినట్లే నడుచుకోవాలి. బాలయ్యే ఈ సినిమాకి నిర్మాత కాబట్టి, క్రిష్ వున్నపళంగా 'ఎన్‌టిఆర్ బయోపిక్' స్క్రిప్ట్ మార్చేయాలేమో.
'కథానాయకుడు' వరకూ ఇబ్బంది వుండకపోవచ్చుగానీ, 'మహానాయకుడు'కి మాత్రం మార్పులు తప్పవంటున్నారు. జనవరిలో ఈ రెండు పార్టులూ విడుదల కావాలి. అయితే డిసెంబర్ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో మార్పులొచ్చే అవకాశం వుంది కాబట్టి, ముందు జాగ్రత్తగానే సెకెండ్ పార్ట్‌లో కంటెంట్‌ని 'పాజ్'లో 'ఎన్‌టిఆర్ బయోపిక్' టీమ్ పెట్టిందని సమాచారమ్.
ఎన్‌టిఆర్ బయోపిక్ టీమ్ వ్యూహాలు ఎలా వున్నా, అభిమానులు మాత్రం తాజా రాజకీయ పరిణామాలతో కంగారు పడుతున్నారు. వారికి చంద్రబాబు తాజాగా ఇచ్చిన షాక్ అలాంటిది.