బాలకృష్ణ ప్రధాన పాత్రలో స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ రాబోతోంది. ఈ సినిమాకి దర్శకులుగా పలువురు దర్శకులను పరిశీలించగా చివరికి ఆ ఛాన్స్ తేజ చేతికి చిక్కింది. జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుందని బాలయ్య తెలిపారు. కాగా ఈ సినిమాలో హీరో ఓకే, డైరెక్టర్ దొరికేశాడు. ఇక నిర్మాతలెవరనుకుంటున్నారా? నిర్మాతల్లో ఒకరు బాలయ్య బాబు కూడా ఉన్నారు. బాలయ్యతో పాటు సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కోట్ల ప్రజానీకంతో అభిమానం పొందిన వ్యక్తి ఎన్టీఆర్. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా చెరగని ముద్ర వేశారు. ఒక్క తెలుగు రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్‌ని అభిమానించే వాళ్లున్నారు. అంతటి మహనీయుని జీవిత చరిత్రని తెరకెక్కించడం అంటే ఆషా మాషీ కాదు. చిన్న విషయం అస్సలు కాదు. నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ఇక తేజ విషయానికి వస్తే, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో తేజ ఫామ్‌లోకి వచ్ఛేశాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యని తప్ప మరొకరిని ఊహించడం కష్టమే. ఇక బయోపిక్ అంటే జీవిత చరిత్ర మొత్తం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఆయన సినీ, రాజకీయ రంగానికి చేసిన సేవలు, జీవితం చరమాంకంలో అనుభవించిన అననుకూల పరిస్థితులు.. వీటిలో ఎన్ని అంశాల్ని తెరపై ఆవిష్కరిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఆ పూర్తి డీటెయిల్స్‌ని చిత్ర యూనిట్ వెల్లడించనుంది.