దర్శక ధీరుడిగా రాజమౌళిని ఎనలేని పేరు ఉంది. ట్రెండ్ సెట్ చేయడం, కొత్త రికార్డుల్ని సృష్టించడం రాజమౌళి స్టైల్. ఆయన దేనికీ భయపడడు. సినిమాలో హీరో లేకపోయినా, ఈగనైనా హీరోగా చేసి సినిమాని హిట్ చేయగల ధీరుడు. అలాంటి రాజమౌళి తొలిసారి భయపడుతున్నాడు. అదీ తన సినిమా రిలీజ్ విషయంలో. దర్శక ధీరుడి నుంచి రాబోతున్న కొత్త సినిమా `ఆర్.ఆర్.ఆర్`. ఈ సినిమాపై టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ భారతీయ చిత్రసీమ బోలెడన్ని ఆశలు, అంచనాలు పెంచుకుంది. 2020 జూన్ 30న ఈ సినిమాని విడుదల చేద్దామనుకుంటున్నారు.
అయితే అప్పటికి ఈ సినిమా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆ డేట్ దాటితే, దసరాకే ఈ సినిమా విడుదల కావాలి. దసరా మంచి సీజనే కానీ, గత కొన్నేళ్లుగా దసరా సీజన్‌లో హిట్టయిన సినిమాలు కనిపించడం లేదు. సైరా హిట్ అయినా బాలీవుడ్ లో తన ప్రతాపం చూపించలేదు. `ఆర్.ఆర్.ఆర్` ఇండియన్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తీస్తున్న సినిమా. వేసవిలో విడుదల అయితే తప్ప, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు. అందుకే ఈ సినిమాని 2021 వేసవికి విడుదల చేస్తే బాగుంటుందని జక్కన్న భావిస్తున్నాడట.
2020 సెప్టెంబరులో సినిమా పూర్తయితే 2021 వేసవి వరకూ సినిమాని విడుదల కాకుండా దాచుకోవడం అంత సేఫ్ కాదు. అందుకే షూటింగ్ మెల్లమెల్లగా చేసుకుంటూ 2021 జనవరి నాటికి పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. బాహుబలి సమయంలోనూ విడుదల తేదీ విషయంలో రాజమౌళి ఇంత టెన్షన్ పడలేదని, ఆర్.ఆర్.ఆర్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నాడని, అందుకే రిలీజ్ డేట్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేకపోతున్నాడని టాక్.