ఎన్టీఆర్ - రాజమౌళిల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ తొలి హిట్ `స్టూడెంట్ నెంబర్ 1`కి రాజమౌళినే దర్శకుడు. అలానే రాజమౌళి సినీ ప్రయాణం కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది. సింహాద్రితో ఇద్దరూ పీక్స్ లోకి వెళ్లిపోయారు. ఆ తరవాత యమదొంగ... సూపర్ డూపర్ హిట్. అందుకే ఎన్టీఆర్ అంటే రాజమౌళికి, రాజమౌళి అంటే ఎన్టీఆర్‌కి ప్రత్యేకమైన అనుబంధం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రాజమౌళిని ప్రత్యేకమైన దృష్టితో చూస్తారు. ఎన్టీఆర్‌కి తిరుగులేని హిట్లు ఇచ్చిన.. జక్కన్న అంటే... ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అమితమైన అభిమానం.. గౌరవం.
అయితే.. ఆర్.ఆర్.ఆర్ తో అది కాస్త తగ్గిపోయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకంటే.. చరణ్ పాత్రకే ఎక్కువ వెయిటేజీ ఇవ్వడం వాళ్లు ఇప్పటికీ జీర్ణం చేసుకోలేకపోతున్నారు. రాజమౌళి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారు. తమ హీరోకి అన్యాయం చేశారని వాపోతున్నారు. ఇటీవల `ఆచార్య` ప్రీ రిలీజ్ వేడుకకకు రాజమౌళి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చరణ్‌ని సెల్ఫ్ మేడ్ హీరో అని పొగిడిన విషయమూ తెలిసిందే. అది కూడా... ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. దాంతో రాజమౌళిని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు.
ఇదంతా చూస్తుంటే.. రాజమౌళిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ తో సోలోగా ఓ సినిమా తీసి... సూపర్ హిట్టు కొడితే తప్ప.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ శాంతించరు. ఎన్టీఆర్‌కి సరిపడ ఓ కథ తన దగ్గర ఉందని రాజమౌళి ఇది వరకే ప్రకటించాడు. `గరుడ` అనే పేరుతో ఓ కథ రాసుకున్నానని చెప్పాడు. ఆ సినిమా పట్టాలెక్కితే గానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం చల్లారదేమో..?