ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో జనతా గ్యారేజ్ వచ్చి సూపర్ హిట్టయ్యింది. ఈ కాంబోలో ఇప్పుడు మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ సినిమాపై అఫిషియల్ క్లారిటీ ఎప్పుడో వచ్చేసింది కానీ.. ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. ఈ సినిమా కథ ఎన్టీఆర్‌కి నచ్చలేదని, మార్పులూ చేర్పులూ సూచించాడని, అందుకే సినిమా ఆలస్యం అవుతోందని రకరకాల కథనాలు వచ్చాయి. ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ రావడం లేదని ఎన్టీఆర్ అభిమానులూ గుర్రుగానే ఉన్నారు. వాళ్లందరికీ తీపి వార్త చెప్పేశాడు ఎన్టీఆర్. తన తదుపరి సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇచ్చేశాడు. కొరటాల తో సినిమా ఈనెలలోనే కొబ్బరి కాయ కొట్టుకొంటుందని, మార్చి 20లోపే.. సెట్స్‌పైకి వెళ్తుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాని విడుదల చేస్తామని.. రిలీజ్ డేట్ తో సహా చెప్పేశాడు.
అయితే... పనిలో పనిగా ఫ్యాన్స్‌కి క్లాస్ పీకాడు. అప్ డేట్ల కోసం దర్శక నిర్మాతలపై ఒత్తిడి తీసుకురావొద్దని కోరాడు. అభిమానులు అడిగారు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా అప్ డేట్లు ఇవ్వలేమని, దాని కోసం వేచి చూడాలని అన్నాడు. తన సినిమాకి సంబంధించిన అప్ డేట్... తన భార్య కంటే ముందుగా ఫ్యాన్స్‌తోనే షేర్ చేసుకొంటానని మాట ఇచ్చాడు. అభిమానుల అత్యుత్సాహం వల్ల.. దర్శక నిర్మాతల్లో ఒత్తిడి పెరుగుతోందని, అది సినిమాపై ప్రభావం చూపిస్తుందని సుతిమెత్తగా మందలించాడు. ఫ్యాన్స్ కి క్లాస్ పీకినా.. చివర్లో ఎన్టీఆర్ కొత్త సినిమాకి సంబంధించిన అప్ డేట్ వచ్చింది కాబట్టి.. తారక్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.