మరి కొద్ది గంటల్లో `ఎన్టీఆర్` బయోపిక్‌లోని రెండవ, చివరి భాగం `మహానాయకుడు` ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోని మలుపులన్నీ తెరబద్ధం చేశారు. చివరి రోజుల్లో ఎన్టీఆర్ అనుభవించిన మానసిక క్షోభ, అల్లుడి వెన్నుపోటు, లక్ష్మీ పార్వతితో రెండో పెళ్లి ఇవన్నీ చూపిస్తారా? లేదా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే... ఇవేం ఈ సినిమాలో కనిపించడం లేదట. బసవతారకం మరణంతో ఈకథ ముగుస్తుందని, ఎన్టీఆర్ మరణం, ఆయన చివరి రోజులు ఇవేం చూపించడం లేదని తెలుస్తోంది.
బసవతారకం కోణంలోనే ఎన్టీఆర్ కథ మొదలైంది. ఆమె మరణంతో ముగుస్తుంది. అయితే ఆ తరవాతే ఎన్టీఆర్ జీవితం రాజకీయంగా చాలా మలుపులు తిరిగింది. అల్లుడిగా నమ్మించి, వెన్నెపోటు పొడిచిన ఘటన.. బసవతారకం మరణం తరవాతే జరిగింది. అంటే.. ఇవన్నీ ఇందులో చూసే అవకాశం లేదన్నమాట. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఉన్న డ్రామా ఇంకెక్కడా కనిపించదు. దాన్ని దాచేయడం ఎన్టీఆర్ అభిమానుల్ని, సినీ ప్రియుల్ని ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి.